Rich CM Jagan VS Poor: జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాజమార్గం కోసం ఓ కాలనీని మాయం చేశారు: లోకేశ్
Published: May 19, 2023, 9:10 AM

Rich CM Jagan VS Poor : ధనిక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ పేదలు పేరిట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దిగమింగిన అవినీతి అనకొండ ఇప్పుడు తానొక పేదవాడినని అంటోందని దుయ్యబట్టారు. పేదలంటే ప్రాణం అంటూ.., పేదల కోసం అవతరించిన మహానుభావుడిలా మాట్లాడుతోందని లోకేశ్ మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2019 వరకు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అమరారెడ్డి కాలనీ అని ఒక కాలనీ ఉండేదని, సుమారు 1000 పేద కుటుంబాలు అక్కడ నివసించే వారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు మరో రాజమార్గం కావాలని చెప్పి ఆ పేదల కాలనీని రాత్రికి రాత్రి మాయం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ అబద్ధం చెప్తాడనే తాజా గూగుల్ మ్యాప్‌ను చూపిస్తున్నట్లు తెలిపారు. అమరారెడ్డి కాలనీ ఏమైందని నిలదీశారు. నువ్వు పేదల గురించి మాట్లాడే అర్హత జగన్ ఉందా అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.