Nannapaneni Rajakumari Tears Over Chandrababu Arrest: చంద్రబాబుపై కక్షపూరితంగా కేసు పెట్టారు.. కన్నీటి పర్యంతమైన నన్నపనేని రాజకుమారి
Nannapaneni Rajakumari Tears Over Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌పై టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి కన్నీటిపర్యంతమయ్యారు. తెలుగు మహిళలందరూ.. ఆయన కోసం ఎదురు చూస్తున్నారని.. కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆమె అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌కు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండానే వైసీపీ కక్షపూరితంగా కేసు పెట్టారని మండిప్డడారు. వైసీపీ పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు.
వైసీపీ పాలనలో రోడ్లు బాగోలేవు, నిత్యావసరాల ధరలు పెరిగాయని.. అవి ఎన్నికల్లో ప్రజలు అడగకూడదనే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. అన్న క్యాంటీన్లు, కాలేజీలు మూసేశారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ యాత్రలను అడ్డుకునేందుకే వైసీపీ దుశ్చర్యకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందనే.. వైసీపీ ఇలాంటి చర్యలకి పాల్పడిందన్నారు. చంద్రబాబు కట్టించిన అసెంబ్లీలో కూర్చుని.. ఆయన ఏం కట్టించారని మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు.