పొట్ట చేత పట్టుకుని వచ్చినా పస్తులే - ఉపాధి లేక వలస కూలీల విలవిల
Migrant Labours difficulties in Nellore: విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పనులు లేక ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వలస వచ్చిన కూలీలు పనులు దొరకటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వ్యవసాయ పనులు లేక, సరైన పరిశ్రమలు లేక కుటుంబాలతో సహా.. వేలాది మంది నెల్లూరుకు వలసలుగా తరలివచ్చామని వారు వివరించారు. నెల్లూరులో పనుల కోసం రోడ్ల మీద ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వలస జీవులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
ఉత్తరాంధ్ర వలస కూలీలు నెల్లూరు జిల్లాలో ఉపాధి కోసం.. ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చినట్లు వివరించారు. అక్కడి నుంచి నెల్లూరులోని కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట వంటి ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నట్లు వివరించారు. ఇక్కడికి వచ్చినా పనులు లేక ఇబ్బందిగా ఉందని.. ముఖ్యంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో కూలి పనులు కూడా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాగుండేదని.. ప్రస్తుతం పనుల లేక రోడ్డున పడ్డామని అన్నారు. పూర్తి కుటుంబాలతో తరలివచ్చామని అన్నారు.