జ్యోతిర్లింగ క్షేత్రంలో కార్తిక శోభ - అంగరంగ వైభవంగా లక్ష దీపోత్సవం
Laksha Deepotsavam In Srisailam Temple: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో కార్తిక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్తికమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపాలతో దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ పుష్కరిణి మెట్ల వద్ద అలంకరించిన ప్రమిదలను వెలిగించారు. శివలింగం, త్రిశూలం, ఢమరుకం వంటి ఆకారాల్లో కార్తిక దీపాలను చూడముచ్చటగా ఏర్పాటు చేశారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు, గుడి సిబ్బంది.. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శోభాయమానంగా ముస్తాబు చేసి ఆలయం లోపల నుంచి వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ఉభయ దేవాలయాల అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్లకు దశవిధ హారతులు సమర్పించారు. హారతుల సమర్పణ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్తిక దీపాల కాంతులతో ఆలయ పుష్కరిణి అంతా వెలుగులీనింది.