Lack of Facilities in Tribal Welfare Hostel: సిబ్బంది లేక విద్యార్థుల ఆకలి కేకలు.. ఒకపూట తిని మరోపూట పస్తులు
Lack of Facilities in Gowada Tribal Welfare Hostel: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ ఎస్టీ వసతిగృహం విద్యార్థులు వారం నుంచి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. వంట చేసేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో.. ఒక పూట తిని, మరో పూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన రోడ్డుపై వంటావార్పు నిర్వహించి అక్కడే అల్పాహారం చేశారు. భోజన కష్టాలతో పాటు హాస్టల్ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడం లేదని... విద్యార్థులు వాపోతున్నారు.
గత వారం రోజులుగా వసతి గృహంలో వంట సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులే వంట చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది రాకపోవడంతో.. గోవాడ-అంభేరుపురం రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టి తమ నిరసన తెలియజేశారు. వంట సిబ్బంది లేకపోవడంతో ఓ పూటతిని మరోపూట పస్తులుండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మెనూ ఛార్జీలు తక్కువగా ఇస్తుండటంతో.. సరైన ఆహారం అందడం లేదన్నారు. వంట సిబ్బందిని వెంటనే నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.