హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా వైసీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు: కనకమేడల
Kanakamedala Ravindra Kumar Allegations on YCP Leaders: స్కిల్ కేసులో హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా.. వైసీపీ నాయకులు దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తప్పుపట్టారు. జగన్ అండ్ కో తమపై ఉన్న సీబీఐ కేసుల్లో విచారణను ఎదుర్కొని తర్వాత ఎదుటివారిపై ఆరోపణలు చేయాలన్నారు. సజ్జల మీడియా ముందుకు వచ్చి అసత్యాలు చెబుతున్నారు. షెల్ కంపెనీలకు డబ్బు తరలించారని సజ్జల అంటున్నారు.. కానీ ప్రాథమిక ఆధారాలు లేవని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.. సజ్జల వ్యాఖ్యలు చూస్తుంటే కోర్టుల పట్ల గౌరవం లేదని తెలుస్తోందని అన్నారు.
అనేక కేసుల్లో ఈ ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేశాయని అన్నారు. జగన్‌పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి.. వాటిపై విచారణ జరగకుండా న్యాయ ప్రక్రియను జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసు పెట్టినంత మాత్రాన ఎవరూ దోషి కాదని జగన్ తెలుసుకోవాలని అన్నారు. పార్టీ సభ్యత్వానికి వచ్చిన రుసుంను.. ఈ కేసుకు లింక్ పెట్టడం దారుణమని అన్నారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలులో ఉంచారు. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కోర్టుకు హాజరుకాకుండా జగన్ తప్పించుకుంటున్నారని రవీంద్రకుమార్ అన్నారు.