టీడీపీ హయాంలో 'ఉద్యాన' వైభవం - నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో దయనీయం : మాజీ మంత్రి కాలవ
Kalava Srinivasulu Selfie Challenge In Anantapur District : అనావృష్టికి నెలవైన అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చాలనే దృఢ నిశ్చయంతో పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సహించిందని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్‌లో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు క్రాస్‌లో టీడీపీ హయాంలో డ్రిప్ ఏర్పాటు చేసిన ద్రాక్ష తోటలో సోమవారం ఆయన... 32వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. 2014-19 మధ్యలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 90 శాతం రాయితీ కింద రైతులకు డ్రిప్ పరికరాలు మంజూరు చేశారన్నారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల వరకు ప్రభుత్వ రాయితీ అందిందన్నారు.
Kalava Comments On YCP Government : నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎంతమంది రైతులకు సబ్సిడీ కింద డ్రిప్ పరికరాలు అందించారో చెప్పాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాపును నిలదీశారు. ఎన్ని ఎకరాల్లో పండ్ల తోటలను విస్తరించారో చెప్పాలన్నారు. తెలుగుదేశం హయాంలో జిల్లాలో పండించిన పండ్లను ఢిల్లీ నగరానికి ఎగుమతి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని కూడా ఉపయోగించలేని దయనీయ స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.