Kadapa RTC Depot Officials Negligence కడప ఆర్టీసీ డిపో అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులను మధ్యలో దింపేసి..!
Published: Aug 21, 2023, 2:10 PM

Kadapa RTC Depot Officials Negligence on Passengers: కడప ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వలన 27 మంది ప్రయాణికులు మార్గమధ్యంలో అవస్థలకు గురయ్యారు. బస్సులో ప్రయాణికులు ఉన్నారనే విషయాన్ని కూడా మరచిన అధికారుల తీరు ప్రయాణికులను విస్మయానికి గురి చేసింది. కడప నుంచి బద్వేలుకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. భాకరాపేటలో బద్వేల్‌కు వెళ్లేందుకు 27 మంది ప్రయాణికులు బస్సు ఎక్కారు. బస్సు సిద్ధవటం వద్దకు వెళ్లగానే కడప డిపో అధికారులు డ్రైవర్‌కు ఫోన్ చేసి బస్సు చెన్నైకి పంపించాలని.. వెంటనే వెనక్కి రమ్మని చెప్పారు. అధికారుల ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిన డ్రైవర్లు.. ప్రయాణికులను సిద్ధవటంలో దించేశారు. ఆగ్రహించిన ప్రయాణికులు డ్రైవర్‌ను ప్రశ్నించారు.
డిపో అధికారులు ఫోన్ చేసి బస్సును చెన్నైకి పంపించాలని.. వెనక్కి తీసుకొని రమ్మన్నారని డ్రైవర్ బదులిచ్చాడు. దీంతో తాము ప్రయాణికులం కాదా.. తాము బస్సు టికెట్ చెల్లించలేదా.. ఇలా మార్గమధ్యంలో ఉన్న ఫలంగా దించేస్తే తాము ఎలా వెళ్లాలంటూ ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. డ్రైవర్‌తో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. దీంతో అదే మార్గంలో వేరే బస్సు వెళ్తుంటే ఆ బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించారు. కడప RTC అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.