Nadendla Manohar on election alliance 'వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం.. అందరితో కలిసి పనిచేస్తాం'
Published: May 14, 2023, 4:14 PM

Nadendla Manohar on election alliance రానున్న ఎన్నికల్లో వ్యతిరేక ఓట్లు చీలకుండా ఏ పార్టీలు వచ్చినా కలిసి పోటీ చేస్తామని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పొత్తుల విషయంలో పార్టీలో స్పష్టత ఉందని అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరం కలిసి కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తానరనే దానిపై చర్చించలేదని నాదెండ్ల వివరించారు. వామపక్షాలు కలిసి వచ్చినా పొత్తులకు సిద్ధమేనని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. ఈ నెలాఖరులోగా గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని.. కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఇతర ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. బటన్ నొక్కితే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇటీవల మృతి చెందిన ముగ్గురు జనసేన కుటుంబాలకు ఒక్కక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారాన్ని నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందించారు.