ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్ చేతివాటం-లెక్కల్లో రాయకుండా మద్యం బాటిళ్ల విక్రయం
Irregularities in Government Liquor Shops : పల్నాడు జిల్లా శావల్యాపురం ప్రభుత్వ మద్యం దుకాణా సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని బెల్టు షాపులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దుకాణంలోని సూపర్‌వైజర్ రూ.5.50లక్షల నగదు గోల్‌మాల్ చేసి పరారైన సంఘటన శావల్యాపురం మండలంలో జరిగింది.
నరసరావుపేట డిపో ఎక్సైజ్ సీఐ మున్నంగి ప్రమీల తెలిపిన వివరాల మేరకు.. ప్రభుత్వ మద్యం దుకాణ ఉద్యోగి రామకోటేశ్వరరావు ఈ నెల 15న అమ్మిన మద్యం బాటిళ్ల డబ్బును చెల్లించక పోవటంతో అధికారులు తనిఖీకి చేపట్టారు. దుకాణంలో సూపర్‌వైజర్ లేకపోవటం, మద్యం నిల్వలో వ్యత్యాసాలు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం దుకాణంలో తనిఖీలు నిర్వహించగా మొత్తం 32వేల మద్యం బాటిళ్లకు 28 వేల బాటిళ్లు మాత్రమే ఉన్నాయని.. 3వేల మద్యం బాటిళ్లు అక్రమంగా అమ్మినట్లు అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.5.50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
ఉద్యోగి కుటుంబ సభ్యులు నుంచి రూ.2లక్షలను జమ చేశామని, మరో రూ.3.50లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. సూపర్‌వైజర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడు పట్టుబడిన వెంటనే కేసు నమోదు చేసి, విధుల నుంచి తొలగిస్తామని మున్నంగి ప్రమీల తెలిపారు.