దొంగపత్రాలతో ఇసుక దోపిడీ - అడ్డుకున్న టీడీపీ, జనసేన నేతలు
Illegal Sand Mining in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా బల్లిపాడు గ్రామంలోని గోదావరి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ టీవీ రామారావు మండిపడ్డారు. సోమవారం బల్లిపాడు ఇసుక ర్యాంపును టీడీపీ, జనసేన నేతలు పరిశీలించగా.. నకిలీ వే బిల్లులతో పదుల సంఖ్యలో లారీలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం ర్యాంపులో ఇసుక తవ్వకాలు, రవాణాను అడ్డుకున్నారు. అక్రమ తరలింపును నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
అనంతరం రామారావు మాట్లాడుతూ.. రెండు సంస్థల మధ్య ఆధిపత్య పోరుతో పడవల మీద ఆధారపడే కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. ఇదంతా ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మైనింగ్ అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా.. ఏ ఒక్క అధికారి అడ్డుకోకపోవడం శోచనీయమన్నారు. బాధ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను అధికారులు నిలుపుదల చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనలో తాళ్లపూడి మండల టీడీపీ అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు, మాజీ అధ్య క్షుడు కైగాల శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.