హైకోర్టు బెయిల్‌తో చంద్రబాబుకు పూర్తి స్థాయి స్వేచ్ఛ : న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్
High Court Senior Advocate Sunkara Rajendra Prasad Interview: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉండగా... ఇప్పుడు పూర్తిస్థాయి బెయిల్ ఇస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు ఉత్తర్వులు వెలువరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. చంద్రబాబుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పూర్తి స్థాయి స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో సైతం చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని రాజేంద్రప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలు, ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న కోర్టు బెయిల్ మంజూరు చేసిందని సుంకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రెగ్యులర్ బెయిల్ మంజురు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబు ఇకపై బహిరంగ సభల్లో మాట్లాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కేవలం కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సుప్రీం కోర్టులో సైతం బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెండు సంవత్సరాల పాటు విచారణ చేసిన సీఐడీ... ఏనాడు చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని తెలిచెప్పకుండా... హడావిడిగా చంద్రబాబు పేరును చేర్చారని సుంకర రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు సుంకర తెలిపారు.