జడ్జిలను దూషించారన్న పిటిషన్‌పై హైకోర్ట్ విచారణ - ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశం
High Court Hearing on Insulting Judges Petition: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సామాజిక మాధ్యమాల వేదికగా జడ్జిలను దూషించారంటూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Hearing Adjourned For Two Weeks: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై దూషణలు చేస్తూ.. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై మంగళవారం హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. న్యాయ వ్యవస్థను కించపరిచేలా కొంతమంది అనుచిత పోస్టులు పెట్టారని తెలిపారు. పిటిషన్‌లో మరికొన్ని అంశాలు చేర్చి, అమెండ్ చేస్తామని కోర్టును కోరారు. ఇప్పటికీ ప్రతివాదుల్లో కొందరికీ నోటీసులు చేరలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.