జీవోల గోప్యతపై హైకోర్టు వ్యాఖ్యలు - ఒక్కరోజే 1230 జీవోలు అప్‌లోడ్
Government Uploading GOs to Online: జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీవోలన్నీ అప్‌లోడ్ చేయాలని అన్ని శాఖలకూ జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు వ్యాఖ్యలతో గోప్యంగా ఉంచిన జీవోలన్నింటినీ ప్రభుత్వ శాఖలు అప్‌లోడ్ చేస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే 12 వందల 30 జీవోలను ప్రభుత్వ శాఖలు అప్‌లోడ్ చేశాయి. జీవోలను అన్‌లైన్‌లో ఉంచేందుకు అభ్యంతరం ఎందుకని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీవోల గోప్యతపై వేర్వేరుగా దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన జీవోలన్ని ప్రభుత్వం హడావిడిగా అప్‌లోడ్ చేస్తుంది. ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగింపు, మంత్రులు ప్రజాప్రతినిధులు, విదేశీ పర్యటనలు, రుణాలు, వివిధ కార్పోరేషన్లు, విద్యుత్ సంస్థలకు సంబంధించిన రుణాలు, వడ్డీ చెల్లింపులు తదితర అంశాలపై ఇప్పటి వరకూ దాచి ఉంచిన పాత జీవోలన్నింటినీ ప్రభుత్వ శాఖలన్నీ హడావిడిగా అప్‌లోడ్ చేస్తున్నాయి.