Gold Cash Stolen from a House in Rajam : రాజాంలో భారీ చోరీ.. 20 తులాల బంగారం, 2 లక్షల నగదు మాయం..
Gold Cash Stolen from a House in Rajam: విజయనగరం జిల్లా రాజాం వాసవి నగర్లోని ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారుగా 20 తులాల బంగారం, రెండు లక్షల రూపాయల నగదును దుండగులు చోరీ చేశారు.
రాజాం పట్టణ పరిధి వాసవి నగర్లో నివాసం ఉంటున్న గద్దు వెంకటరమణ.. వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం స్వగ్రామానికి వెళ్లారు. జి శిగడాం మండలం ఎందువ గ్రామానికి వెళ్లిన కుటుంబ సభ్యులు.. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చారు. చూసే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలు తెరిచి ఉండటం గమనించారు. ఇంటిలో ఉన్న 20 తులాల బంగారం, రూ. 2 లక్షలు నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లోకి చొరబడి ఈ దొంగతనం చేసి ఉంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై రాజం పోలీసులకు ఫిర్యాదు చేశారు.