గ్యాస్ సిలిండర్ల లోడు లారీ పల్టీ - అదృష్టవశాత్తూ పేలని సిలిండర్లు, స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్
Gas Cylinders Lorry Overturned in Bapatla District: బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ నిండుగా ఉన్న సిలిండర్ల లోడుతో వెళుతున్న లారీ బోడవాడ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. గుంటూరు నుంచి చీరాల వెళ్తుండగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పంట కాలువలో లారీ బోల్తాపడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
Gas Cylinders Overturned IN Crops : లారీ బోల్తా పడిన సమయానికి ఆ రహదారిలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గ్యాస్ లోడెడ్ సిలిండర్ల లారీ బోల్తా పడటం వల్ల స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పంట కాలువలో పడటంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన చోటుకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది... బోల్తా పడిన లారీలోని గ్యాస్ సిలిండర్లను మరో వాహనంలోకి తరలించే ఏర్పాట్లు చేశారు.