కన్నుల పండువగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవం
Gajula Alankarana Mahotsavam: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓంకారం ప్రతిధ్వనిస్తోంది. శివాయైనమః... దుర్గాయై నమః అంటూ భక్తులు ప్రణమిల్లుతున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి... అమృతమయి కనకదుర్గమ్మను గాజుల అలంకరణలో భక్తులు దర్శిస్తున్నారు. కార్తీకమాసం విదియ రోజున ఏటా గాజుల అలంకరణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దసరా నవరాత్రుల తర్వాత రెండు సమయాల్లో దుర్గమ్మకు విశేష అలంకారాలు ఉంటాయి. దీపావళి తర్వాత కార్తికమాసంలో గాజులతో విదియ రోజున వివిధ రంగుల మట్టి గాజులతో మూల విరాట్టుతోపాటు అమ్మవారి ఆలయ ప్రాంగణం, ఉత్సవ మూర్తులను అలంకరిస్తారు. గాజుల ఉత్సవంలో భాగంగా ఉదయం నాలుగు గంటల నుంచి అమ్మవారి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఉదయం ఐదు గంటల నుంచి టిక్కెట్టు దర్శనాలు ప్రారంభించారు.
ఈ ఏడాది అమ్మవారి అలంకరణ కోసం సుమారు రెండు లక్షల వరకు గాజులను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గాజులను తోరణాలుగా కట్టి అమ్మవారి మూలవిరాట్‌ను అలంకరించారు. మహామండపం ఆరో అంతస్థులో ఉన్న అమ్మవారి ఉత్సవమూర్తిని గాజులతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ గాజుల అలంకరణలో వినియోగించిన వాటిని ఆ తర్వాత భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అందిస్తారు. అలాగే అన్నా చెల్లెళ్లకు సంబంధించి కార్తీకమాసం విదియ విశిష్టమైందిగా కూడా పండితులు పేర్కొంటున్నారు.