పక్కా ప్లాన్‌తో నకిలీ బంగారం విక్రయం - అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
Fake Gold Selling Gang in Annamayya District : నకిలీ బంగారం విక్రయించి ప్రజలను మోసం చేస్తున్న ఏడుగురు అంతరాష్ట్ర దొంగలను.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు కిలోల నకిలీ బంగారం, తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె డీఎస్పీ కేశప్ప వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఠాలోని ముగ్గురు మదనపల్లె కేంద్రంగా నకిలీ బంగారం విక్రయిస్తున్నట్లు గుర్తించాం. తెలంగాణలోని అత్తాపూర్‌కు చెందిన పల్లె రాజా నిందితుల వద్ద బంగారం కొనుగోలు చేయగా.. అది నకిలీదని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితులను పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఏడుగురు నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ చీటింగ్ గ్యాంగ్ గురించి ఇదివరకే చాలా సార్లు ఫిర్యాదులు వచ్చాయి. వీళ్లు వాడే సిమ్ కార్డులు వీరి పేరుమీద ఉండవు. వీరు రకరకాల గ్రూపులను పెట్టుకుని పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతుంటారు. మెుదటి గ్రూపు ఫోన్లో మాట్లాడి వారిని తీసుకురావటం... రెండవ గ్రూపు వచ్చిన వారిని నమ్మించటం, మూడో గ్రూపు పోలీస్ లాగా నటించటం.. ఇలా రకరకాల గ్రూపులతో ప్రజలను మోసం చేస్తుంటారు. ఎవరైనా తక్కువ ధరకే బంగారం అమ్ముతామంటే వారిని నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.