ఆశ కార్యకర్తలకు కఠిన 'పరీక్ష' - పాస్ సర్టిఫికెట్తో ఎగ్జామ్ సెంటర్కు హాజరైన అభ్యర్థి
Exam for ASHA Workers in Alluri District: నిర్ణీత చదువు ఉండాలంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆశ కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేశారు. అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు పరీక్ష నిర్వహించారు. వీరిలో అధికసంఖ్యలో కనీసం తెలుగు చదవడం రాని వృద్ధులు ఉన్నారు. పాడేరుకు సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆశ కార్యకర్తలు చలిలో ఇక్కట్లు పడి పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. చాలా మంది కార్యకర్తలకు కనీసం తెలుగు, చదవడం రాదు. దీంతో మినిమం చదువు ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పరీక్ష వారికి అగ్ని పరీక్ష మారింది. పాడేరులో 8 సెంటర్లు ఇవ్వడంతో పరీక్ష కేంద్రాన్ని గుర్తించేందుకు ఆశ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు.
పరీక్ష ప్రారంభమైనప్పటికీ కొంతమంది సెంటర్లకు చేరుకోలేదు. వీరిలో చాలా మంది.. తాము సంతకం ఒక్కటే నేర్చుకున్నామని.. క్లాసులో ఉపాధ్యాయులు ఆన్సర్లు చెబుతారు అంటూ పేర్కొన్నారు. కనీసం చదువులేని తమకు ఇప్పుడు పరీక్షలు అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆశ కార్యకర్తలు వాపోయారు. అయితే ఇందులో ప్రాథమిక పరీక్ష, ఉన్నత పరీక్ష అంటూ రెండు రకాలు ఉంటాయి. ఎనిమిదో తరగతి పాస్ అయిన వారు మొదట పరీక్ష రాయనవసరం లేదు. పదో తరగతి పాస్ అయిన వారు రెండూ రాయనవసరం అవసరం లేదు. ఓ కార్యకర్త పదో తరగతి పాస్ అయినప్పటికీ హాల్ టికెట్ రావడంతో.. పదో తరగతి పాస్ సర్టిఫికెట్ పట్టుకుని ఎగ్జాం సెంటర్కి వచ్చారు.