'ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకు ఉంది - సీఐడీ జగన్ బంట్రోతులా వ్యవహరిస్తోంది'
EX IAS Ramanjaneyulu About YS jagan Govt: ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజలకు ఉందనే అంశం రాజ్యాంగంలోనే ఉందని... మాజీ ఐఏఎస్, టీడీపీ నేత రామాంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గుంతలతో నిండిన రహదారి పై ర్యాలీ నిర్వహించారు. సీఐడీ అనేది సివిల్ సర్వెంట్ అని... నిబంధనలు దాటి అధికారులు మాట్లాడకూడదన్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి కేసుల గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటని విమర్శలు గుప్పంచారు. ఎన్నుకున్న ప్రభుత్వం సక్రమంగా పని చేయకపోతే కూల్చే అధికారం ప్రజలకు ఉందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని అరెస్టు చేసే అధికారం ఎవరికి లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకువస్తే విమర్శించక పూజిస్తారా అని ప్రశ్నించారు.
సీఐడీ.. జగన్ బంట్రోతులా వ్యవహరిస్తుందని రామాంజనేయులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయన్నారు. మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే చర్యలు తీసుకోవచ్చన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను రామాంజనేయులు తప్పుబడ్డారు. వైద్యంలో ఏ, బి, సి, డి లు కూడా తెలియని వారు ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదని పేర్కొన్నారు. జగన్ సీఎం అయ్యాక ఎస్సి, ఎస్టీలకు చెందిన 27 పథకాలు రద్దు చేశారని విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో తాగు నీరు, సాగు నీరు, రహదారులు, వ్యవసాయం గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు తప్పా ప్రభుత్వానికి మరో ఆలోచన లేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.