ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయంలో వరుస సస్పెన్షన్లు - స్వామివారి నివేదన సరుకులలో అవకతవకలు
Dwaraka Tirumala Chinna Venkanna Temple Employees Suspended: ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఉద్యోగులు వరుస సస్పెండ్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. స్వామివారి నివేదన సరుకులలో వ్యత్యాసం కారణంగా సీనియర్ అసిస్టెంట్ రాంబాబు అనే ఉద్యోగిని సస్పెండ్ చేసిన అధికారులు, తాజాగా నివేదనశాలలో వంట స్వామి వెంకటాచార్యులను సస్పెండ్ చేసి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రవీణ్‌ను విధుల నుంచి తొలగించారు.
ఇటీవల స్వామి వారి నివేదనశాలలో సరుకులు మాయమయ్యావని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆలయ అధికారులు ఆరోపణలపై విచారణ జరిపించారు. అధికారుల విచారణలో సెంట్రల్ స్టోర్ నుంచి 15 రోజులకు ఒకసారి స్వామి వారి నివేదన శాలకు.. నివేదనకు కావలసిన సరుకులు వస్తుంటాయి. అయితే సరుకులలో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువగా ఉన్న సరుకుల విలువ రూ.1.84 లక్షలని, దానికి సంబంధించి నివేదనశాల స్టోర్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదేవిధంగా సంబంధిత ఏఈఓ, సూపరింటెండెంట్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. అయితే విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. నివేదనశాల నుంచి వంట స్వామి వెంకటాచార్యులు, అతనికి సహాయకుడిగా అవుట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ప్రవీణ్.. రెండు బ్యాగ్లు బయటకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆ బ్యాగులలో ఒక దానిలో నేతి డబ్బాలు, మరొక దానిలో ఇతర సరకులు ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వంట స్వామి వెంకటాచార్యులను సస్పెండ్ చేసి, సహాయకుడైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రవీణ్‌ను విధుల నుంచి తొలగించారు.