సంపద సృష్టించకుండా అప్పులు చేసి ప్రజలకు పంచుతున్నారు: టీడీపీ నేత టీజీ భరత్
Door to Door Campaign of TDP Leaders in Kurnool : రాబోయే ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కర్నూలులో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. కర్నూలు టీడీపీ ఇంఛార్జ్ టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నగరంలోని 11వ వార్డులో ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. వైసీపీ హయాంలో సంపద సృష్టించకుండా అప్పులు చేసి ప్రజలకు పంచారని.. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని పార్టీ నాయకులు తెలిపారు.
ఈ ప్రభుత్వం అప్పులు చేసి.. దానం చేయ్యడం అనేది తప్పు విధానమని.. సంపద సృష్టించే సత్తా లేకున్నా అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు వేసే ముందు ఆలోచించి మంచి నాయకులకు వేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భారత దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ అని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నుంచే విజయభేరి మోగించి అధికారంలోకి రావాలని కోరారు. కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలంటే టీడీపీ గెలవాలని పార్టీ నాయకులు తెలిపారు.