అట్రాసిటీ కేసులో అరెస్టైన దస్తగిరి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కడప కోర్టు
Dastagiri bail petition dismissed by Kadapa Court: అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన పులివెందులకు చెందిన డ్రైవర్ దస్తగిరి బెయిలు పిటిషన్‌ను కడప కోర్టు కొట్టేసింది. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి.. తన బంధువుల అమ్మాయిని కారులో తీసుకెళ్తున్నారనే కారణంతో వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల పోలీసులు.. కిడ్నాప్, అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
అక్టోబరు 31వ తేదీన దస్తగిరిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేయగా.. మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి.. బెయిలు కోసం కడప కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు జరిగాయి. దస్తగిరికి బెయిలు ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిలు పిటిషన్ కొట్టేశారు.
అయితే వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైల్లో చంపేందుకు కుట్ర పన్నుతున్నారని కొద్ది రోజుల క్రితం అతడి భార్య షబానా ఆందోళన వ్యక్తంచేశారు. కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరికించారని.. తన భర్తకు ఏం జరిగినా వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారణమని ఆరోపించారు.