పనులు సకాలంలో పూర్తి చేయాలి - అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం
CS Jawahar Reddy on Central Govt Funded Projects: రాష్ట్రంలో చేపట్టిన 11 కేంద్ర ప్రాయోజిత పథకాల పనులను వేగవంతం చేసి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, రహదారులు భవనాలు, పురపాలక పట్టణాభివృద్ధి, జలవనరులు, పాఠశాల విద్య, పరిశ్రమలు, ఆరోగ్య శాఖలకు సంబంధించి 27,259.52 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ 11 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకూ 5996.97 కోట్ల రూపాయల విలువైన పనులను మాత్రమే చేపట్టినట్టు తెలిపారు. మిగిలిన పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజక్టుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర వాటాతో పాటు లోన్ రుణాన్ని కూడా సమకూర్చుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకూ అయిన పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటి కప్పుడు చెల్లించినట్లు స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ పనుల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాజెక్టుల అమల్లో ఇక ఏమాత్రం జాప్యం లేకుండా త్వరితగతిన నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు.