కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీపీఐ 30 గంటల నిరసన దీక్ష
CPI 30 Hours Initiation on Drought in AP: రాష్ట్ర వ్యాప్తంగా కరవు పరిస్థితి అధికంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కరవు విషయంలో ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కరవు మండలాలు రాష్ట్రంలో 400 ఉండగా.. ఆ తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో కృష్ణా జలాల పునః పంపిణీ.. కరువు తీవ్రతపై 30 గంటల నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ నిరసన దీక్షలో రామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదని విమర్శించారు. తక్షణమే సీఎం స్పందించి.. పంటలు నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులు, కూలీలు, చేతి వృత్తుల వారు వలసలు పోతున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా జగన్ రెడ్డిలో చలనం లేదని ఆగ్రహం వక్తం చేశారు. సీఎం సాయం చేయకపోగా కేంద్రానికి నివేదిక కూడా పంపడం లేదన్నారు. ఎపీ సీఎం అంటే కేంద్రానికి అసలు లేక్కే లేదన్న రామకృష్ణ.. ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ దీక్ష చేపట్టామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.