ఓఎన్జీసీ బాధితులకు పరిహారం విడుదల - ఫిషింగ్ హార్బర్ బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ
CM Jagan Released ONGC Compensation : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఓఎన్జీసీ పైపులైను కారణంగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో నష్టపోయిన 23వేల 458 కుటుంబాలకు.. ఆ సంస్థ నుంచి ఏటా సాయం ఇప్పిస్తున్నట్లు తెలిపారు. నాలుగో విడత కింద 161.86 కోట్లు ఓఎన్జీసీ సంస్థ అందించినట్లు వెల్లడించారు. సోమవారం విశాఖలో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకుంటామన్నారు.
కాకినాడ, కోనసీమ జిల్లాల అధికారులు, మత్స్యకారులతో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి.. సూళ్లూరుపేట నియోజకవర్గం మాంబట్టు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గోనాల్సి ఉంది. అంతేకాకుండా వాకాడు మండలంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, పులికాట్ సరస్సు పునరుద్ధరణ పనుల ప్రారంభం వంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ, భారీ వర్షాల కారణంగా షెడ్యూల్ రద్దు చేశారు. సీఎం తిరుపతి జిల్లా పర్యటననూ వాయిదా వేశారు.