ఈ నెల 15వ తేదీన మాచర్లకు సీఎం జగన్ - వరికపూడిశెల ప్రాజెక్టుకు శంకుస్థాపన
CM Jagan Macherla Visit: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయలుదేరతారు. మాచర్ల చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశం సభాస్ధలికి చేరుకోనున్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు (Varikapudisela Project) శంకుస్ధాపన చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
అయితే ఈ వరికపూడిశెల ప్రాజెక్టు.. పల్నాడు జిల్లాని సస్యశ్యామలంగా మార్చే కలల ప్రాజెక్టు. ఇప్పటికే దీనికి గతంలో రెండుసార్లు శంకుస్థాపనలు చేసినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. సాగునీరు అందని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని ఆయకట్టుకు.. నాగార్జునసాగర్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసి సాగర్ కుడికాలువ కింద సాగునీరు ఇవ్వాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. తమకు సాగునీరు అందించాలని దశాబ్దాలుగా రైతులు ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. తాజాగా ఈనెల 15న వరికపూడిశెలకు శంకుస్థాపన చేయడానికి జగన్ మాచర్ల వస్తున్నారు.