దుమారం రేపుతున్న జూపూడి వ్యాఖ్యలు - వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామంటున్న బ్రాహ్మణులు
Brahmana Chaitanya Vedika Fires on YCP leader Jupudi: వైసీపీ నేత జూపూడి ప్రభాకరరావు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు జూపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ బస్సు యాత్ర సంర్భంగా జూపూడి మాట్లాడిన తీరుపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. బ్రాహ్మణులపై వ్యాఖ్యలు చేసిన జూపూడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
YSRCP Leader Jupudi Prabhakar Rao Comments: వైసీపీ సామాజిక సాధికార సభలో బ్రాహ్మణులను కించపరిచేలా మాట్లాడిన జూపూడి ప్రభాకరరావు వెంటనే క్షమాపణ చెప్పాలని అదే విధంగా ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇతర సామాజిక వర్గాలను అవమానించడం.. అధికార పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలలో పదవులు అనుభవించడానికి ఏ పెత్తందార్ల కాళ్లు పట్టుకున్నావో చెప్పాలని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు.. ఇతర కులాలను కించపరిచేలా మాట్లాడటం ఆనవాయితీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.