15 వేల మంది మృతులకు ఓటు హక్కు! ఎక్కడో తెలుసా?
Bonda Uma Complaint to the Election Officer : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీఎల్వోలు ఎన్ని సార్లు ఇంటింటి సర్వే నిర్వహించినా.. ఇప్పటికీ 15 వేల మందికి పైగా చనిపోయిన వారి ఓట్లు.. జాబితాలో ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కొంత మందికి రెండు మూడు ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్యాలయంలో సెంట్రల్ ఓటరు జాబితాపై జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాబితాలో అవకతవకలను ఆర్ఓ(RO) దృష్టికి తీసుకువచ్చారు.
257 పోలింగ్ బూత్‌లకు సంబంధించి దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి వివరాలు, ఓటర్లకు దూరంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలను సాక్ష్యాలతో సహా వివరించారు. సెంట్రల్ నియోజకవర్గానికి ఆరుగురు సహాయ ఎన్నికల నమోదు అధికారులు ఉన్నా.. వారు పూర్తి స్థాయిలో బీఎల్వోలతో పని చేయించుకోలేకపోతున్నారని ఉమామహేశ్వరరావు తెలిపారు. దీనివల్ల ఇప్పటికీ దొంగ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు జాబితాలో ఉన్నాయని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త ఓటు నమోదు చేయాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌కు వివరించారు.