Bangalore People and IT Employees Agitation Against CBN Arrest: చంద్రబాబుకు మద్దతుగా బెంగళూరులో ఆందోళన.. "బాబుతో నేను" అంటూ ప్లకార్డులు
Published: Sep 15, 2023, 5:17 PM

Bangalore People and IT Employees Agitation Against CBN Arrest : తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగానికి కీలక కేంద్రమైన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు. ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబును జైలులో పెట్టడాన్ని వారంతా ముక్త కంఠంతో ఖండించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బాసటగా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతం చేశారు. ఇప్పటిదాకా హైదరాబాద్, విజయవాడలో టెకీలు రోడ్డెక్కి గళమెత్తగా.. ఇప్పుడు బెంగళూరులోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు.
నగరంలోని ఫ్రీడమ్ పార్కు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని.. కక్షపూరితమంటూ ఆక్షేపించారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నామంటే.. అది చంద్రబాబు చొరవేనని గుర్తు చేసుకున్నారు.
వర్షంలోనూ ఐటీ ఉద్యోగులు ఆందోళనలు కొనసాగించారు. ఏపీలోని భవిష్యత్ తరాలు బాగుండాలంటే చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలన్నారు. అధికార వైసీపీ చంద్రబాబుపై చేస్తున్నవన్నీ అవాస్తవ ఆరోపణలేనని కొట్టిపారేశారు. ఈ కష్టాలు చంద్రబాబుకు తాత్కాలికమేనని.. త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తారని ఆకాంక్షించారు. ఫ్రీడమ్ పార్కు వద్ద ఆందోళనల తర్వాత ఐటీ ఉద్యోగులు బెంగళూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు అనుకూలంగా.. వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు.