Babu Surety Future Guarantee Program: 5వ తేదీ నుంచి 'బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ' కార్యక్రమం.. మొదటిగా ఆ జిల్లా నుంచే..!
Babu Surety Future Guarantee Program: బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. 5వ తేదీ అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నుంచి పర్యటన ప్రారంభం కానుంది. 5,6,7 తేదీల్లో అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్ షోలు, సభల్లో చంద్రబాబు పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. 8, 9 తేదీల్లో కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు ముందుగా హైదరాబాద్ నుంచి బళ్లారి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటిస్తారని టీడీపీ నేతలు తెలిపారు. బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రచార కార్యక్రమానికి సద్ధమయ్యారు. 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలు పాల్గొంటున్నారు.