ప్రభుత్వం అన్ని కులాలు, మతాలు, పండుగలను ఒకే రకంగా చూడాలి: మత్స్యకారుల సంఘం
Arrangements for World Fisheries Day in AP: ఈ నెల 21వ తేదీన జరగబోయే మత్య్సకార దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మత్స్యకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలు, పండుగలను ఒకే రకంగా చూడాలని పేర్కొన్నారు. అందరికీ వారి వారి ఉత్సవాలను చేసుకునే హక్కులు ఉంటాయని తెలిపారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా... ఈ ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని మత్స్యకారుల సంఘం నాయకులు గరికన పైడిరాజు కోరారు.
మత్స్యకారుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లే సరస్సులు, నదులతో పాటుగా వివిధ ప్రాంతంలోనే నివాసం ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని పైడిరాజు వెల్లడించారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని పైడిరాజు తెలిపారు.