నేను ఆర్డర్ ఇస్తే అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే రాదు : ప్రవీణ్ ప్రకాశ్
AP Education Principal Secretary Praveen Prakash: నెల్లూరు జిల్లా కందుకూరు నియోజక వర్గం మొగిలిచేర్ల ఉన్నత పాఠశాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్ పూర్తి చేయలేదని నిలదీశారు. నవంబర్ వచ్చినా సెప్టెంబర్ పాఠాలు ఎందుకు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..'పాఠశాలలోని ఆరో తరగతిలో 25 మంది విద్యార్థులకుగాను ఆరుగురికే ఇంగ్లిష్ పుస్తకాలున్నాయి. మిగతా విద్యార్థుల అసైన్‌మెంట్లు సరిగాలేవు' అంటూ మండిపడ్డారు. 'నవంబరు 25 నుంచి అర్ధసంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
80 శాతం సిలబస్ పూర్తి కాలేదు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? వారిలో విద్యా సామర్థ్యాలు ఎలా పెరుగుతాయి? ఒక్కో అధికారి రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ పాఠశాలలను పర్యవేక్షించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది' అని పేర్కొన్నారు. 'నేను ఆర్డర్ ఇస్తే.. అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే రాదు. ఏమనుకుంటున్నారో.. మీ ఇష్టం' అంటూ విద్యాశాఖాధికారి గంగాభవాని, కందుకూరు ఉప విద్యాశాఖాధికారి శ్రీనివాసులుపై ఆయన విరుచుకుపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీఈఓ గంగా భవానికి ఆదేశించారు. లేకుంటే ఆమెపై చర్యలు తీసుకుంటానని ప్రవీణ్ ప్రకాశ్ హెచ్చరించారు.