అప్పులకు వడ్డీలు చెల్లించలేని స్థాయికి దిగజారిన ప్రభుత్వం - రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రొఫెషనల్ ఫోరం ఆందోళన
Andhra Pradesh Professional Forum Criticized YSRCP Government: ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై విశ్లేషణలు చూస్తుంటే రానున్న రోజుల్లో - వడ్డీలూ చెల్లించలేని దివాళా స్థాయికి వైసీపీ ప్రభుత్వం చేరుతోందా.. అనే సందేహం కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ విమర్శించింది. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు, సభ్యులు జొన్నలగడ్డ శ్రీనివాసరావుతో ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఒకప్పుడు A+ స్థాయిలో ఉండగా.. ఇప్పుడు దిగజారిపోయినా కేంద్రం అప్పులు తీసుకునేందుకు అనుమతులివ్వడం చూస్తుంటే.. రాష్ట్రానికి మరోసారి ద్రోహం చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతోందని విమర్శించింది. ఇలాంటి వైసీపీ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కొనసాగించే పరిస్థితిలో ఉందా అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వంలో విధానాల్లో స్థిరత్వం లేకపోవడం.. ఆర్థిక విధానాలు, చట్టబద్ధ పాలన లేని పరిస్థితులే రేటింగ్ తగ్గడానికి కారణాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రాభవం తగ్గిందని అన్నారు.