ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మాపై నిర్లక్ష్యం వహిస్తోంది - సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరం
Samagra Shiksha Contract Outsourcing Part Time Federation: సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ నుంచి సమ్మెబాట పడుతున్నట్లు సమగ్ర శిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు తెలిపారు. విద్యాశాఖ పరిధిలో సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం విజయనగరంలో నిర్వహించారు. వారు గత నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సమావేశంలో చర్చించారు.
సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. ప్రభుత్వం స్పందించలేదని కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటి అద్దె, కరవు భత్యం వంటి సౌకర్యాలు కల్పించాలని కాంతారావు కోరారు.