నేలపై కూర్చోవటం మంచిదే- ఎందుకో తెలుసా?

నేలపై కూర్చోవటం మంచిదే- ఎందుకో తెలుసా?
Sitting on the Floor Benefits: పూర్వకాలంలో మన పెద్దవాళ్లు ఎక్కువగా నేలపైనే కూర్చునేవారు. ఇప్పుడు కాలం మారింది. సోఫాలు, కుర్చీలు రావడంతో.. దాదాపు అందరూ వాటిమీదనే కూర్చుంటున్నారు. మరి నేలపై కూర్చోవడం వల్ల కలిగే లాభాలేంటో మీకు తెలుసా.? ఆ విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Sitting on the Floor Benefits in Telugu: ఒకప్పుడు అందరూ నేలపైనే కూర్చునేవారు. నేలపై కూర్చుని అన్ని పనులు చేసుకునేవారు. కానీ ఇప్పుడు కుర్చీలు, సోఫాలు వచ్చాయి. దాదాపు ప్రతి ఒక్కరూ కుర్చీలు, సోఫాల్లోనే రోజులో సగానికి పైగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ల్యాప్ టాప్ ముందు వర్క్ చేసిన, సరదాగా టీవీ చూసిన లేక భోజనం చేసిన కుర్చీలు, సోఫాల్లోనే కానిస్తున్నారు. మరి ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే ఇకపై రోజులో కనీసం కొద్దిసేపయినా నేలపై కూర్చునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే నేలపై కూర్చోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండి..
జీర్ణక్రియ మెరుగవుతుంది.. : నేలమీద కూర్చుని భోజనం చేస్తే.. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేలపై కూర్చుని తినేటప్పుడు ముందుకు వంగి తినాల్సి వస్తుంది. అలా చేసే క్రమంలో పొట్ట కండరాలు కదులుతుంటాయి. దీని వల్ల జీర్ణ రసాలు బాగా విడుదల అవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలకపాత్ర వహిస్తాయి. తద్వారా శరీరానికి కావలసినంత శక్తి అందుతుంది. మనం భోజనం చేయడానికి నేల మీద కాళ్లు మడిచి కూర్చున్నప్పుడు మెదడుకు సంకేతాలు వెళ్తాయి. ఇది జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది.
తుంటి కండరాలు బలపడతాయి..: కుర్చీ, బల్లపై కూర్చునే దానికంటే నేలపై కూర్చుకోవటం వల్ల స్థిరత్వం ఉంటుంది. కుర్చీల్లో కూర్చోవటం వల్ల తుంటి భాగం బిగుతుగా మారే అవకాశం ఉంటుంది. అయితే నేలపై కూర్చోవటం వల్ల హిప్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కండరాలను సాగదీయడంలో, చలనశీలతను పెంచటంలో ఈ పద్ధతి దోహదపడుతుంది. ఇది ఒక రకమైన శారీరక శ్రమలాంటిదే. కాళ్ల దిగువ కండరాలను సాగదీసేందుకు కింద కూర్చోవటం అన్నది దోహదపడుతుంది.
వెన్నునొప్పి నుంచి ఉపశమనం: వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు నేలపై కూర్చోడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నేలపై కూర్చోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది. తద్వారా వెన్ను నొప్పి సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వెన్ను నొప్పితో బాధపడుతున్న వారు నేలపై కూర్చోవడానికి ప్రయత్నించండి.
బరువు తగ్గుతారు..: నేల మీద కూర్చుని తింటే.. మన బరువు కంట్రోల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చుని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. దీని వల్ల బరువు పెరుగుతారు. మనకు సరిపోయేంత తిన్నామా? లేదా? అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్‌ను అందించే ఒక నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్‌పై కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత చురుగ్గా పనిచేస్తుంది. దీంతో మనం సరిపడా.. ఆహారం మాత్రమే తింటాం.. దీంతో బరువు కంట్రోల్లో ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
సోఫాలో గంటల తరబడి కూర్చోవద్దు: గంటల పాటు సోఫాల్లో కూర్చోవద్దు. ఆ అలవాటును మానుకోలేకపోతుంటే గోడవారగా చాప వేసి కింద కూర్చుని వీపుని నిటారుగా ఉంచి, కాళ్లను చాచండి. దీని వల్ల నడుము కండరాలు బలపడతాయి. తరచూ కింద నుంచి లేవడం, కూర్చోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. అలసట, శరీర బలహీనతలూ తగ్గుతాయి.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది: నేలమీద పద్మాసనంలో కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నడుము చుట్టూ ఉన్న కండరాల నొప్పి తగ్గుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల మిమ్మల్ని మీరు దృఢంగా మార్చుకోవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.
