జలుబు వస్తే 'విటమిన్​-సి' మాత్రలు వాడుతున్నారా?.. అయితే ఇది మీ కోసమే..

author img

By

Published : Sep 24, 2022, 7:41 AM IST

Vitamin C Helps Cold

Vitamin C Helps Cold : జలుబు వస్తే విటమిన్ సి మాత్రలు వేసుకుంటే నయం అయిపోతుందని చాలా మంది అనుకుంటారు. అందుకే జలుబు రాగానే విటమిన్​ సి మాత్రలు వాడుతుంటారు. మరీ ఈ విషయం ఎంత వాస్తవమనే దానిపై అనేక రకాల పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు. ఇందులో ఏం తేలిందంటే?

Vitamin C Helps Cold : తరచూ జలుబుతో బాధపడేవారిలో కొందరు విటమిన్‌ సి మాత్రలు వేసుకుంటుంటారు. ఇవి జలుబు వైరస్‌లను కట్టడి చేస్తాయని భావిస్తుంటారు. విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచే మాట నిజమే. నీటిలో కరిగే విటమిన్ల రకానికి చెందిన ఇది మంచి యాంటీఆక్సిడెంట్‌ కూడా. అంతమాత్రాన జలుబు వైరస్‌ల పని పడుతుందని అనుకోవటానికి లేదు. ఈ వైరస్‌లను అడ్డుకోవటంలో, జలుబును తగ్గించటంలో దీని ప్రభావం అంతంతేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రోజుకు 200 మి.గ్రా. అంతకన్నా ఎక్కువ మోతాదులో విటమిన్‌ సి తీసుకోవటం ద్వారా జలుబు బారినపడటం, దీని తీవ్రత, వేధించే కాలం తగ్గుతాయా? అనేది గుర్తించటానికి గతంలో పరిశోధకులు పెద్ద అధ్యయనమే నిర్వహించారు.

అరవై ఏళ్ల వైద్య పరిశోధనను సమీక్షించిన తర్వాత తేల్చిందేంటంటే- జలుబు మొదలయ్యాక విటమిన్‌ సి మాత్రలను మొదలెట్టినవారిలో జలుబు తీవ్రత, ఇది వేధించే సమయంలో ఎలాంటి తేడా లేదనే. రోజూ విటమిన్‌ మాత్రలు వేసుకున్నవారిలోనైతే జలుబు వేధించే సమయం కాస్త తగ్గుతున్నట్టు బయటపడింది. విటమిన్‌ సి మాత్రలు జలుబును నివారించటం లేదని మరో అధ్యయనంలో తేలింది. కాకపోతే కొందరిలో లక్షణాల తీవ్రత కొద్దిగా తగ్గినట్టు గుర్తించారు. ఎక్కువ దూరాలు పరుగెత్తే క్రీడాకారుల వంటి దేహ దారుఢ్యం గలవారిలో మాత్రం రోజూ విటమన్‌ సి మాత్రల వేసుకుంటే జలుబు వచ్చే అవకాశం సగం వరకు తగ్గుతుండటం గమనార్హం. ఏతావాతా జలుబు నివారణ, చికిత్సల్లో ఈ మాత్రలు అంతగా ఉపయోగపడటం లేదనే ఇవన్నీ సూచిస్తున్నాయి.

నిజానికి మాత్రల కన్నా ఆహారం ద్వారా విటమిన్‌ సి లభించేలా చూసుకోవటమే మంచిది. మనకు రోజుకు 65 మి.గ్రా. నుంచి 100 మి.గ్రా. విటమిన్‌ సి అవసరం. దీని మోతాదు 2,000 మి.గ్రా. కన్నా మించితే వికారం, వాంతి, ఛాతీలో మంట, కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. బత్తాయి, నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, టమోటా, క్యాబేజీ, కాలిఫ్లవర్‌, బంగాళాదుంప వాటితో విటమిన్‌ సి దండిగా లభిస్తుంది. ఆహారం ద్వారా లభించే విటమిన్‌ను శరీరం బాగా గ్రహించుకుంటుంది కూడా.

ఇవీ చదవండి: ఈ డైట్​ను పాటించండి.. నిండు నూరేళ్లు జీవించండి!

నడుము నొప్పి వేధిస్తోందా? ఈ సింపుల్​ వర్కౌట్స్​తో రిలీఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.