తరచూ పీడకలలు వస్తున్నాయా? అయితే కాస్త ఇబ్బందే!

author img

By

Published : Sep 27, 2022, 8:15 AM IST

nightmares health problems

Nightmares health problems : పీడకలలతో బాధపడే మధ్యవయసు వారికి పదేళ్ల తర్వాత విషయగ్రహణ సామర్థ్యం లోపించే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉంటుండగా.. వృద్ధులకు డిమెన్షియా వచ్చే అవకాశం 2 రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలింది.

Nightmares Dementia : రాత్రిపూట తరచూ పీడకలలు వస్తున్నాయా? అయితే మలివయసులో మతిమరుపు వచ్చే అవకాశం పెరిగిందనే చెప్పుకోవచ్చు! మధ్యవయసులో తరచూ పీడకలలు వచ్చేవారికి వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి క్షీణించే (డిమెన్షియా) ప్రమాదం పొంచి ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ అధ్యయనంలో తేలింది మరి. పీడకలలకూ విషయగ్రహణ సామర్థ్యం తగ్గటానికి, డిమెన్షియాకూ సంబంధం ఉంటున్నట్టు తాము తొలిసారి నిరూపించామని పరిశోధకులు పేర్కొంటున్నారు.

అధ్యయనంలో భాగంగా 35-64 ఏళ్లకు చెందిన 600 మంది, 78 ఏళ్లు పైబడిన 2,600 మంది సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. తరచూ పీడకలలతో బాధపడే మధ్యవయసు వారికి పదేళ్ల తర్వాత విషయగ్రహణ సామర్థ్యం లోపించే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉంటుండగా.. వృద్ధులకు డిమెన్షియా వచ్చే అవకాశం 2 రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలింది. ఆడవారిలో కన్నా మగవారిలో వీటి మధ్య సంబంధం మరింత ఎక్కువగా ఉంటుండటం గమనించదగ్గ విషయం. మధ్యవయసులో ఉండగానే మున్ముందు డిమెన్షియా వస్తుందా, లేదా అనే విషయాన్ని సూచించే కారకాలు అతి తక్కువ. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే పీడకలలకు, డిమెన్షియాకు మధ్య సంబంధాన్ని నిర్ధరించటానికి మరింత లోతుగా అధ్యయనాలు చేయాల్సి ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌కు చెందిన డాక్టర్‌ అబిడెమి ఒటైకూ అంటున్నారు. అయినప్పటికీ డిమెన్షియా ముప్పు అధికంగా గలవారిని గుర్తించటానికిది ఉపయోగపడగలదని విశ్వసిస్తున్నామని గట్టిగా చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.