జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?

author img

By

Published : Sep 26, 2021, 7:09 AM IST

memory power

శరీరంలో బ్రెయిన్​ అత్యంత ముఖ్యమైన అవయవం. మెదడు సరిగా పనిచేసినప్పుడే మన జ్ఞాపక శక్తి (Memory Power) సరిగా ఉంటుంది. శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆధునిక యుగంలో మతిమరుపు పెద్ద సమస్యగా మారింది. దీనిని అధిగమిస్తూ.. జ్ఞాపక శక్తి పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఏ వ్యక్తి అయినా మరింత చురుగ్గా దూసుకుపోవాలంటే.. శరీరం ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. మెదడులోని వివిధ శరీర అవయవాలకు నాడులు కలిసి ఉంటాయి. ఇది జ్ఞానేంద్రియాలన్నింటికీ ముఖ్యమైన కేంద్రం. మన మెదడులో దాదాపు 90 బిలియన్ల వరకు న్యూట్రాన్లు ఉంటాయి. ఇవి నిరంతరంగా సిగ్నల్స్​ పంపిస్తుండడం వల్లే మనం హాయిగా జీవించగలుగుతున్నాం. మెదడు చెప్పినట్లే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా ఉన్నంత కాలం.. జ్ఞాపక శక్తి (Memory Power) చురుగ్గా ఉంటుంది. అది పెరగాలంటే బ్రెయిన్​ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. అందుకు కొన్ని చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి అంటే శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం. కలత నిద్ర, మగత నిద్ర లాంటివి కాకుండా పూర్తిస్థాయిలో గాఢనిద్ర ఉండాలి. కనీసం రోజుకు ఆరు గంటల నుంచి 8 గంట నిద్ర అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

వయసు పెరిగేకొద్ది మెదడు పని తీరు మందగిస్తుంది. దీంతో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చని వైద్యనిపుణులు చెప్తున్నారు. ధూమపానం, మద్యపానం వల్ల రక్తకణాలు దెబ్బతింటాయి. హానికర రసాయనాలు చేరడం వల్ల మెదడు పని తీరు దెబ్బతింటుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండాలి. కాలుష్యం కూడా మన మెదడుపై ప్రభావం చూపుతుంది. మనం పీల్చుకునే ఆక్సిజన్​లో ఎక్కువశాతం మన మెదడు పీల్చుకుంటుంది. కలుషిత గాలి పీల్చడం వల్ల మెదడుకు ఆక్సిజన్​ సరఫరా తగ్గి.. మెదడు పనిచేయడం మందగిస్తుంది. ఆలాగే చక్కెర ఉన్నవి తీసుకోవడం కూడా మెదడు అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మెదడును చురుగ్గా ఉంచి ఏకాగ్రతను పెంచడంలో ఆహారపదార్థాలు ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా అల్పహారం తప్పనిసరి.. ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి.. రోజూవారి కార్యక్రమాలు చురుగ్గా చేసుకోవచ్చు. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉండే చేపలు తినాలి. వేరుశనగ గింజలు, ఆక్రోట్​, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ప్రతి రోజూ మెదడులోకి అనవసర అలోచనలు చొప్పించకుండా.. ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మన మెదడులోకి మంచి ఆలోచనలు రావాలంటే.. సరైన వ్యాయామం, ధ్యానం, నడక లాంటివి రోజూ కొంత సమయం పాటు చేయడం తప్పనిసరి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెదడు చురుగ్గా ఉంటుంది. సంగీతం వినడం వల్ల కూడా మెదడు బాగా పనిచేస్తుంది. మెదడుకు పదును పెట్టే పనులు, ఆలోచనలతోనే చురుగ్గా, సమర్థవంతంగా ఉంటుంది. అందుకే మన మెదడుకు వ్యాయామం అవసరం అని గుర్తుంచుకోవాలి.

జ్ఞాపక శక్తి మెరుగుపడాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. అప్పుడు మెదడు యాక్టివ్​గా, హెల్తీగా ఉంటుంది. సరైన ఆహారాలు మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపక శక్తి మెరుగుపడడానికి సహాయపడుతాయి.

ఇదీ చూడండి: Eye problems: నీరు తాగట్లేదా? కంటి సమస్యలు వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.