YS Abhishek Reddy: తెరపైకి వైఎస్ అభిషేక్ రెడ్డి.. అనూహ్య పరిణామాలు జరిగితే ఆ బాధ్యతలు..!
Published: May 18, 2023, 12:00 PM


YS Abhishek Reddy: తెరపైకి వైఎస్ అభిషేక్ రెడ్డి.. అనూహ్య పరిణామాలు జరిగితే ఆ బాధ్యతలు..!
Published: May 18, 2023, 12:00 PM
YS Abhishek Reddy Political Entry: సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో.. ఆయన కుటుంబానికి చెందిన మరో యువనేత రాజకీయరంగ ప్రవేశం దాదాపు ఖరారైంది. ఈయన సీఎం జగన్‌కు సమీప బంధువు. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి లింగాల మండలంలో పర్యటించారు.
YS Abhishek Reddy Political Entry: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన కుటుంబానికి చెందిన మరో యువనేత రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖరారైంది. రాజకీయంగా గతంలో తెర వెనుక ఉన్న వైఎస్ అభిషేక్‌రెడ్డి తెర ముందుకు వచ్చారు. ఈయన సీఎం జగన్‌కు సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి బుధవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పర్యటనలో పాల్గొన్నారు.
అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు అభిషేక్ రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రాథమికంగా లింగాల, సింహాద్రిపురం మండలాల వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుండగానే ఎంపీ కార్యక్రమాల్లో తాజాగా ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అభిషేక్‌రెడ్డి విశాఖపట్నంలో వైద్యవృత్తిలో స్థిరపడ్డారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్ అభిషేక్‌రెడ్డి. అయితే వైద్యవృత్తిలో ఉన్న ఈయన ప్రత్యక్షంగా కనిపించడం తాజాగా చర్చనీయాంశమైంది. లింగాల మండలంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి అభిషేక్‌రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. తాజా పరిణామాల దృష్ట్యా పార్టీ పరంగా నియోజకవర్గ బాధ్యతలు చూడటానికి అభిషేక్ రెడ్డిని రంగంలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
MP Avinash Approached Supreme Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్ తరఫు లాయర్లు ఈరోజు మెన్షన్ చేశారు. అయితే అవినాష్‌కు సుప్రీంలో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఇంకా ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమైతే రాత పూర్వక అభ్యర్థన ఇవ్వాలని.. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు.
మంగళవారం నాడు పలు నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. వివేకా హత్య కేసులో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అవినాష్‌రెడ్డికి సోమవారం సాయంత్రం సీఆర్పీ 160 సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోనే ఉన్న అవినాష్ రెడ్డి.. విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు రోజుల గడువు కావాలని.. ఆ తర్వాత ఎప్పుడు రమ్మన్నా విచారణకు హాజరవుతానని తెలిపారు. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లారు. అవినాష్ రెడ్డి లేఖపై స్పందించిన సీబీఐ ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని.. మరోసారి నోటీసులు పంపింది.
ఇవీ చదవండి:
