భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి: పులివెందుల పూల అంగళ్ల నుంచి దూసుకొచ్చిన టీడీపీ బాణం..!

author img

By

Published : Mar 19, 2023, 5:51 PM IST

Updated : Mar 19, 2023, 10:32 PM IST

Etv Bharat

TDP flag fluttered once again : ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో మరోసారి టీడీపీ జెండా రెపరెప లాడింది. 2017 సంవత్సరంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ కోటలో పాగా వేసిన టీడీపీ... తాజాగా అదే మరోసారి జెండా ఎగుర వేయడం విశేషం. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ కంచుకోటలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీలో చేరినప్పటి నుంచి జెండా వదలని వీరాభిమాని.. నేడు ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

TDP flag fluttered once again : పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోట. 40 ఏళ్లుగా ఆ కుటుంబానికి అక్కడి ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ పట్టం కడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మొదలుకుని.. ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పులివెందుల నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి పులివెందుల నియోజకవర్గంలో ప్రత్యర్థి జెండా ఎగరాలంటే చాలా కష్టం. అలాంటి కంచుకోటను బద్దలు కొట్టి 2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలానికి చెందిన బీటెక్ రవి విజయం సాధించగా... ఈనెలలోనే ఆయన పదవీకాలం పూర్తి కానుంది. ఇపుడు ఇదే నియోజకవర్గం నుంచే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని టీడీపీ బరిలో నిలిపింది. ఈయన కూడా సింహాద్రిపురం మండలం కాంబల్లె గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై భారీ విజయం సాధించారు. రాంగోపాల్ రెడ్డి గెలుపొందడంతో పులివెందుల పూల అంగళ్ల వద్ద టీడీపీ జెండా రెపరెప లాడింది.

పార్టీకి వీర విధేయుడు... భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 1969లో భూమిరెడ్డి వీరారెడ్డి, లక్ష్మీదేవి దంపతులకు జన్మించాడు. సింహాద్రిపురం మండలం కాంబల్లెకు చెందిన రాంగోపాల్ రెడ్డి... పులివెందుల లయోలా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, అనంతరం బీఈడీ పూర్తి చేశారు. 1990 నుంచి 1994 వరకు ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేశాడు. తర్వాత చంద్రబాబు సారథ్యంపై మక్కువతో 1996లో టీడీపీలో చేరారు. నాటి నుంచి పార్టీకి వెన్నంటి ఉంటున్నారు. ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం, వారి పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే.. పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నారు. సింహాద్రిపురం మండలం కాంబల్లె పంచాయతీ సర్పంచ్ గా రాంగోపాల్ రెడ్డి సతీమణి కొనసాగుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ పంచాయతీ నుంచి టీడీపీదే ఆధిక్యం. పార్టీకి వీర విధేయుడుగా పనిచేసిన రాంగోపాల్ రెడ్డి... తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం రాయలసీమ పార్టీ శిక్షణ శిబిరం డైరెక్టర్ గా ఉన్నారు.

పేదలకు భూ పంపిణీ... 2005లో వేముల మండలం వేల్పుల వద్ద జరిగిన జంటహత్యల కేసులో రాంగోపాల్ రెడ్డిని ప్రత్యర్థులు కేసులో ఇరికించారు. ప్రత్యర్థులు ఆయన ఇంటిని అప్పట్లో తగలబెట్టారు. స్వగ్రామం కాంబల్లెలో తన 3 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాలకు ఉచితంగా ఇచ్చారు. పార్టీ తరఫున, పేదల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. వైఎస్ కుటుంబానికి ఎదురొడ్డిన ప్రతి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సతీష్ రెడ్డి పోటీ చేయగా.. ఆయనకు కుడి భుజంగా పనిచేశారు. తర్వాత బీటెక్ రవి పోటీ చేసినా అదే స్థాయిలో రాంగోపాల్ రెడ్డి పార్టీ కోసం పనిచేశారు. ఇపుడు సగర్వంగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందడంపై పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

పార్టీ శ్రేణుల సంబురాలు... భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారనే సమాచారంతో సాయంత్రం నుంచే జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పులివెందుల పూల అంగళ్ల వద్ద పార్టీ జెండా ఎగురేసి.. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాగా వైఎస్ కంచుకోట నుంచి టీడీపీ జెండా ఎగురడంపై వైఎస్సార్సీపీ శ్రేణులకు మింగుడు పడని అంశం.

ఇవీ చదవండి :

Last Updated :Mar 19, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.