భారీగా పెరిగిన విద్యుత్‌ బిల్లులు.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

author img

By

Published : May 9, 2022, 5:02 AM IST

విద్యుత్‌ బిల్లులు

భారీగా వస్తున్న విద్యుత్ బిల్లులు చూసి సామాన్యులు షాక్ కు గురవుతున్నారు. ఇంతేసి బిల్లలు ఎలా కట్టగలమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరకుల పెరుగుదలతో ఇప్పటికే మోయలేని భారంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ...విద్యుత్‌ ఛార్జీల భారంపై పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సామాన్య, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం భారీగానే పెరిగింది. 2022 ఏప్రిల్‌ నుంచి అమలయ్యే కొత్త టారిఫ్‌వల్ల డిస్కంలకు అదనంగా రూ.1,400 కోట్లు వసూలవుతుందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రకటించింది. వినియోగదారులు అందరిపై సమానంగా భారం పడుతుందని అంతా భావించారు. కానీ బిల్లులు చేతికి వచ్చేప్పటికి తక్కువ విద్యుత్తు వాడిన వారికి ఎక్కువ భారం అధిక విద్యుత్తు వాడిన వారికి తక్కువ భారం పడింది. 225 యూనిట్లకు మించి.. అంటే భారీగా విద్యుత్తును వినియోగించుకునే పెద్ద వినియోగదారులను చూసీ చూడనట్లు వదిలేసిన డిస్కంలు.. తక్కువ విద్యుత్తు వాడుకునే పేద, సామాన్య ప్రజల మీద అధిక భారం మోపి బాదేశాయి.

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి ఏప్రిల్‌లో 187 యూనిట్ల విద్యుత్‌ వినియోగించారు. విద్యుత్‌ వినియోగానికి రూ.789 వచ్చింది. (దీనికి విద్యుత్‌ స్థిర ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జీల వంటివన్నీ కలిసి మొత్తం బిల్లు రూ.891 అయ్యింది). ఇదే వినియోగానికి పాత టారిఫ్‌ ప్రకారం రూ.573.20 చెల్లిస్తే సరిపోయేది. కొత్త టారిఫ్‌ ప్రకారం రూ.789 వంతున చెల్లించాల్సి వస్తోంది. మార్చితో పోలిస్తే విద్యుత్‌ వినియోగం మీదే అదనపు భారం 37.65%.. అంటే రూ.215.80.

...

రూ.950 కోట్ల భారం
రాష్ట్రంలో ఏప్రిల్‌ నాటికి సుమారు 1.6 కోట్ల గృహ విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. అందులో 60-70 శాతం 200 యూనిట్లలోపు వినియోగించే వారున్నట్లు డిస్కంల అంచనా. కొత్త టారిఫ్‌ ప్రకారం వారిపై సుమారు 37.65% వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అంటే కొత్త టారిఫ్‌తో డిస్కంలకు రానున్న రూ.1,400 కోట్లలో సుమారు రూ.950 కోట్లు పేద, మధ్యతరగతి వర్గాల నుంచే వసూలవుతాయని అంచనా.
* విద్యుత్‌ సంస్థల లెక్కల ప్రకారం 2021-22లో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం సుమారు 68,274 మిలియన్‌ యూనిట్లుగా (ఎంయూ) ఉంది. ఇందులో 30%.. అంటే సుమారు 20వేల ఎంయూలు గృహ విద్యుత్‌ వినియోగం ఉంటుందని అంచనా.
* 2022 మార్చి వరకు అమల్లో ఉన్న పాత టారిఫ్‌లో పేదల కోసం కేటగిరీ-ఎ కింద 75 యూనిట్ల వరకు ఉన్న గ్రూప్‌ను పూర్తిగా తొలగించారు. 75 యూనిట్లలోపు వినియోగించేవారు పాత టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ ఛార్జీల రూపేణా రూ.137.50 చెల్లిస్తే సరిపోతుంది. కొత్త టారిఫ్‌ ప్రకారం అదే 75 యూనిట్ల వినియోగానికి రూ.192 చెల్లించాలి. అంటే రూ.54.50 (39.63 శాతం) అదనపు భారాన్ని పేదలు భరించాల్సి వస్తోంది.

భారం తగ్గినట్లు చూపాలని..
విద్యుత్‌ కనెక్షన్‌ జారీచేసే సమయంలో వినియోగదారుల నుంచి తీసుకునే డిపాజిట్‌పై ఏటా వడ్డీ లెక్కించి.. ఆ మొత్తాన్ని ఏప్రిల్‌లో వసూలు చేసే బిల్లులో సర్దుబాటు చేస్తాయి. ఈసారి మే నెలలో జారీచేసే బిల్లులో వడ్డీ మొత్తాన్ని సర్దుబాటు చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. దీంతో కొత్త బిల్లులో వడ్డీ రూపేణా సామాన్య వినియోగదారులకు రూ.15-25 వంతున తగ్గింది. ప్రస్తుతానికి భారం కొంత తక్కువగా చూపించాలని డిస్కంలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఇదీ చదవండి: తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు.. యూనిట్​కు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.