తల్లిదండ్రులకు ప్రణమిల్లి.. పాదయాత్రకు లోకేశ్​ పయనం

author img

By

Published : Jan 25, 2023, 8:26 PM IST

Updated : Jan 26, 2023, 10:31 AM IST

Lokesh

Lokesh Kadapa Tour: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 27 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. పాదయాత్రలో భాగంగా లోకేశ్​ తల్లిదండ్రుల దీవెనలతో హైదరాబాద్​ నుంచి పాదయాత్రకు బయల్దేరాడు. పాదయాత్ర విజయవంతం కావాలని కడపలో గల వివిధ దేవస్థానాలను దర్శించుకున్నారు.

Lokesh Kadapa Tour: ఈనెల 27వ తేదీన కుప్పం నుంచి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేపట్టే పాదయాత్రకు.. తొలి అడుగు పడింది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని నివాసంలో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి.. అత్తమామలు బాలకృష్ణ, వసుంధర, ఇతర బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నారు. 400 రోజులపాటు.. ప్రజాక్షేత్రంలోనే ఉండనున్న లోకేశ్‌ను.. తల్లి భువనేశ్వరి కారు వరకూ వెళ్లి సాగనంపగా.. భార్య బ్రాహ్మణి హారతి ఇచ్చి విజయ తిలకం దిద్దారు. కుటుంబ సభ్యులంతా భావోద్వేగంతో.. లోకేశ్‌ను ఆశీర్వదించారు.

తల్లిదండ్రులకు ప్రణమిల్లి.. పాదయాత్రకు లోకేశ్​ పయనం

ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద నివాళి: తొలుత NTR ఘాట్‌లో తాత సమాధి వద్ద నివాళి అర్పించిన లోకేశ్‌.. అక్కడి నుంచి కడప చేరుకున్నారు. స్థానిక తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కడప విమానాశ్రయం నుంచి.. 12 కిలోమీటర్ల మేర ర్యాలీగా స్వాగతం పలికారు. కూడళ్లలో భారీ గజమాలలతో అభిమానం చాటారు. మహిళలు వీర తిలకం దిద్ది హారతులు పట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన జన సందోహాన్నిచూసి.. లోకేశ్‌ పిడికిలి బిగించి విజయ కేతనం చూపించారు.

కడపలో ప్రత్యేక పూజలు: పాదయాత్ర విజయవంతం కావాలని కడపలోని దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం, కడప పెద్ద దర్గా, మరియాపురం చర్చిలను సందర్శించారు. హైదరాబాద్​ నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న లోకేశ్​కు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో దేవుని కడప వెళ్లి వార్షిక బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు, అలాగే ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో లోకేశ్ పాల్గొన్నారు.

దేవుని కడప లక్ష్మీవేంకటేశ్వరస్వామి దర్శనానంతరం అక్కడి నుంచి కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రార్థనల్లో పాల్గొని చాదర్‌ సమర్పించారు. దర్గాలో ప్రార్థనలు పూర్తైన తర్వాత మరియాపురం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనానంతరం కడప నుంచి తిరుమలకు బయల్దేరారు. గురువారం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల నుంచి కుప్పం వెళతారు. శుక్రవారం స్థానిక ఆలయంలో పూజల తర్వాత యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం కుప్పంలో నిర్వహించే బహిరంగసభలో లోకేశ్ పాల్గొంటారు. ఈ మేరకు కుప్పంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కడప సందర్శన సందర్భంగా లోకేశ్​ని కలడానికి విమానాశ్రయానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపయ్యాక కార్యకర్తలను ఆపేసి బీటెక్‌ రవిని పోలీసులు అనుమతించారు.

కడప పర్యటన ముగించుకున్న లోకేశ్‌.. రోడ్డు మార్గాన రాత్రే తిరుమల చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామి దర్శనానంతరం.. ఈ మధ్యాహ్నానికి కుప్పం చేరుకుంటారు. శుక్రవారం ఉదయం వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 11గంటల 3 నిమిషాలకు యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు. అదే రోజు కుప్పంలో జరిగే భారీ బహిరంగ సభకు.. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో.. 3 రోజుల పాటు మొత్తం 29 కిలోమీటర్లు యాత్ర సాగనుంది. మొత్తంగా 4వందల రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా పాదయాత్ర సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది.

రాష్ట్ర ప్రజలకు లేఖ: పాదయాత్రకు బయల్దేరే ముందు రాష్ట్ర ప్రజలకు నారా లోకేశ్‌ బహిరంగ లేఖ రాశారు. స‌మాజ‌మ‌నే దేవాల‌యంలో కొలువైన ప్రజ‌ల‌ంటూ లేఖ ప్రారంభించిన ఆయన.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అంద‌రిపై ఉందన్నారు. అన్నివ‌ర్గాల‌కు అన్యాయం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అన్ని రంగాల‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండ‌ని కాళ్లా వేళ్లా ప‌డి 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. సీఎం అయ్యాక సాగిస్తున్న విధ్వంసాన్ని ప్రజలంతా చూస్తూనే ఉన్నారని గుర్తుచేశారు.

వైఎస్సార్సీపీ బాదుడే బాదుడు పాల‌న‌లో బాధితులు కానివారు లేరన్నారు. ప్రజ‌ల‌కు ర‌క్షణ క‌ల్పించి, శాంతిభ‌ద్రత‌ల‌ను కాపాడాల్సిన పోలీసు వ్యవ‌స్థను.. జ‌గ‌న్ త‌న ఫ్యాక్షన్ పాలిటిక్స్ న‌డిపించే ప్రైవేటు సైన్యంగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజ‌ల్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని అన్నారు. సైకో పాల‌న‌లో ఇబ్బందులు ప‌డుతున్న ప్రజల గొంతుక అవుతానని, అరాచ‌క స‌ర్కారుతో పోరాడ‌టానికి సార‌థిగా వ‌స్తున్నానని చెప్పారు.

యువ‌త‌కు భ‌విత‌న‌వుతా, అభివృద్ధికి వార‌ధిగా నిలుస్తానన్న లోకేశ్.. రైత‌న్నను రాజుగా చూసేవ‌ర‌కూ విశ్రమించ‌బోనన్నారు. ఆడబిడ్డలకు సోద‌రుడిగా ర‌క్షణ అవుతానని, అవ్వా తాత‌ల‌కు మ‌న‌వ‌డినై బాగోగులు చూస్తానని లేఖలో తెలిపారు. ప్రజలే ఒక ద‌ళ‌మై, బ‌ల‌మై యువ‌గ‌ళం పాద‌యాత్రను న‌డిపించాలని కోరారు. మీ అంద‌రి కోసం వ‌స్తున్నా.. ఆశీర్వదించండి, ఆద‌రించండని కోరారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 26, 2023, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.