జోరు వానలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Aug 4, 2022, 12:48 PM IST

Updated : Aug 4, 2022, 7:51 PM IST

వైఎస్సార్ జిల్లాలో జోరు వానలు

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాయలసీమ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా... వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోత వానకు నెల్లూరు నగరం జలసంద్రంగా మారింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

విరామం లేకుండా పడుతున్న వానలకు రాయలసీమ జిల్లాలు జలమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాపాగ్ని నదిలో వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో.. వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వీరపునాయునిపల్లె మండలం ఓబుల్ రెడ్డి పల్లె వద్ద పొంగి పొర్లుతున్న వాగులో ఇద్దరు చిక్కుకున్నారు. గొర్రెలను మేతకు తీసుకెళ్లిన సమయంలో....వంక దాటుతూండగా....ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ చెట్టును పట్టుకుని ఆగారు. స్థానికుల ద్వార సమాచారం తెలుసుకున్న పోలీసులు....గ్రామస్థుల సహకారంతో వారిని రక్షించారు.

జోరు వానలు.. వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరులు

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండంలం బూచెర్ల రహదారిని వరద ముంచెత్తింది. వరద ఉద్ధృతికి ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో సహా కొట్టుకుపోతుండగా గ్రామస్థులు కాపాడారు. తాడు సాయంతో బయటకు లాగారు. ధర్మవరం చెరువు వర్షపు నీటితో నిండిపోయింది. అర TMC సామర్థ్యమున్న ధర్మవరం చెరువుకు జలకళ సంతరించుకుంది. చెరువుకు ఉన్న 7 మరువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పొరపాటున బ్రిడ్జి పై నుంచి పెన్నా నదిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ వ్యక్తిని రక్షించారు.

కారును తోస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
కారును తోస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరులో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని రహదారులు కాలువల్లా మారాయి. రైల్వే అండర్ పాస్ వద్ద మోకాళ్లలోతు వరకు నీళ్లు నిలిచాయి. మాగుంట లేఔట్ వద్ద అనేక కార్లు నీటమునిగిపోయయి. కొన్ని కార్లు ముందుకు కదల్లేక మొరాయించాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి...ఆగిపోయిన కార్లను స్వయంగా నెట్టి సహాయం చేశారు. ముత్తుకూరు రోడ్డు, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి వద్ద కూడా వర్షపు నీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారీ వర్షం కారణంగా ఆర్టీసీ బస్టాండు, ఎమ్మెల్యే కార్యాలయం నీట మునిగింది. పట్టణ ప్రధాన రహదారిపై వరద నీరు నిలవడంతో.... వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

ఇవీ చూడండి :

Last Updated :Aug 4, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.