వైఎస్సార్సీపీకి షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు

author img

By

Published : Mar 19, 2023, 7:55 AM IST

Updated : Mar 19, 2023, 9:15 AM IST

SHOCK TO YCP

AP Graduate MLC Election Analysis: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి దిమ్మ తిరిగే తీర్పు వెలువడింది. "వైనాట్‌ 175” అంటూ విర్రవీగడాన్ని ప్రజలు సహించలేదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ తీరుపై జనం విసుగెత్తిపోయారని... అధికార దాష్టీకాన్ని, ధనబలాన్ని పట్టభద్ర ఓటర్లు తిప్పికొట్టారని ఢంకా భజాయిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుపై ఇది రెఫరెండమే అని తేల్చిచెబుతున్నారు.వైఎస్సార్సీపీ నేతలు చెప్పినట్లు ఆడుతున్న కొందరు అధికారులు, పోలీసులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలని... విధి నిర్వహణలో నిష్పాక్షికంగా లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఈ ఫలితాలు గట్టి హెచ్చరికలు పంపాయని ఉద్ఘాటిస్తున్నారు.

వైఎస్సార్సీపీకి షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు

AP Graduate MLC Election Analysis : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాభవం ఎదురవడం, టీడీపీ అనూహ్య విజయం సాధించడం రాజకీయ నేతల్లోనే కాకుండా మేధావులు, సామాన్యుల్లోనూ ఎన్నో విశ్లేషణలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రతిపక్షాలనూ, ప్రశ్నించినవారినీ అక్రమ కేసులు, అరెస్టులతో భయపెడుతూ వైఎస్సార్సీపీ సాగిస్తున్న అరాచక పాలనకు ఈ తీర్పు చెంపపెట్టని టీడీపీ సహా ఇతర విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. పాలకులు భావిస్తున్నట్లుగా ప్రజలు అమాయకులేం కాదని అవకాశం కోసం ఎదురుచూసి కీలెరిగి వాత పెడతారనే విషయం మరోసారి రుజువైందని అంటున్నారు.

ప్రజా వ్యతిరేకత మొదలైతే ఒక ప్రాంతంతో ఆగదని, అన్నిచోట్లా ఒకేలా ప్రతిఫలిస్తుందని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయన్నది విశ్లేషకుల మాట. ఆ చివర ఉన్న ఉత్తరాంధ్ర నుంచి ఈ మూల ఉన్న రాయలసీమ వరకు ప్రభుత్వ వ్యతిరేకత ఒకే రకంగా ఉండటం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ధర్మాన ప్రసాదరావు వంటి మంత్రులు, ప్రజాప్రతినిధులే పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ఒకసారి, విశాఖే అసలు రాజధాని అని మరోసారి వైఎస్సార్పీపీ నాయకులు ఎంత ఊదరగొట్టినా త్వరలోనే తానూ విశాఖకు మకాం మారుస్తానని ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతున్నా ఉత్తరాంధ్ర ప్రజలు ఏ మాత్రం ఖాతరు చేయలేదని ఆ ప్రాంత టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. విశాఖను రాజధాని చేస్తే జరిగే లబ్ధి ఏంటో తెలియదు గానీ కళ్లముందే కనిపిస్తున్న రుషికొండ విధ్వంసం, వైఎస్సార్పీపీ నాయకుల భూదోపిడీలు, అక్రమాలు, అరాచకాల వైఎస్సార్పీపీ ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర వాసుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణాలయ్యాయని ఈ ఎన్నికల ఫలితాల్లో అది సుస్పష్టంగా కనిపించిందని అన్నారు.

వైఎస్సార్పీపీ అరాచక పాలన ఆ పార్టీ కంచుకోటలుగా భావించే రాయలసీమ ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి నింపాయడానికి ఈ ఫలితాలు ఓ సూచికలా నిలిచాయనే విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోని పూల అంగళ్ల సెంటర్‌లో బాణసంచా కాల్చి తెలుగుదేశం గెలుపు సంబరాలు చేసుకున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో అధికార పార్టీ నాయకుల అక్రమాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటనకే అడ్డంకులు సృష్టించడం, టీడీపీ నాయకులపై దాడి చేసి వారిపైనే అక్రమంగా కేసులు పెట్టడం వంటి అరాచకాల్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. అందుకే ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టారని అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విశ్లేషించారు. అర్థబలం, ధన బలంతో ఏ ఎన్నికల్లోనైనా గెలవగలమన్న అధికార పార్టీ అహంకారానికి ఈ ఫలితాలు చెంపపెట్టని అన్నారు.

ఉత్తరాంధ్ర టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు మధ్య తరగతి వర్గానికి చెందిన సాధారణ అధ్యాపకుడు. ఆయనపై పోటీ చేసిన సుధాకర్‌ ధనవంతుడే కాదు.. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కూడా. తూర్పు రాయలసీమ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ ఉన్నత విద్యావంతుడు, ఇంజినీరింగ్‌ కళాశాల నడుపుతున్నారు. ఆయనపై పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి ఆర్థికంగా బలవంతుడు. 2014 ఎన్నికల్లో నకిలీ లేబుల్స్, హోలోగ్రామ్స్‌తో కల్తీ మద్యం తయారు చేసి, నెల్లూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకూ సరఫరా చేశారన్న అభియోగంపై నమోదైన కేసులో ఆయన ఏ3గా ఉన్నారు.

పశ్చిమ రాయలసీమలో గెలిచిన టీడీపీ అభ్యర్థి రామగోపాల్‌రెడ్డి ఆర్థికంగా అతి సామాన్యుడు. ఆయనపై పోటీ చేసిన వెన్నపూస రవీంద్రరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి కుమారుడు. ఆర్థికంగా బలవంతుడు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి, ప్రలోభపెట్టి గెలవాలని చూశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిని పక్కనబెట్టి, సామాన్యులైన టీడీపీ అభ్యర్థులను గెలిపించడం పట్టభద్రుల విజ్ఞతకు నిదర్శనమని ఘంటాపథంగా చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భుజ బలం, డబ్బు బలం, అధికార బలాల్ని ప్రయోగించడంతోపాటు ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, ఓటర్లను భయపెట్టి, దొంగ ఓట్లు వేయించి, ఫలితాల్ని తారుమారు చేసి సాధించిన విజయాలు అధికార పార్టీ నాయకుల్లో మితిమీరిన విశ్వాసానికి కారణమయ్యాయని టీడీపీ నేతలు అంటున్నారు. అందులో నుంచి వచ్చిందే "వైనాట్‌ 175” అని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ నోటి నుంచి పదేపదే ఈ మాట వస్తోందని గుర్తుచేస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినందున వచ్చే సాధారణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్నీ గెలిచేయగలమన్నది ఆయన ధీమాకు కారణమైందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమంటూ ప్రజల్లో వర్గ వైషమ్యాల్ని రెచ్చగొట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి నమ్మకానికి, వైఎస్సార్సీపీ నాయకుల అతి విశ్వాసానికి పెద్ద ఎదురుదెబ్బ అని టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

వైఎస్సార్సీపీ నాయకులు ఏమంటున్నా, మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముమ్మాటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పనితీరుపై ప్రజా తీర్పేనని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన ఈ ఎన్నికలు కచ్చితంగా సెమీ ఫైనల్సేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు పట్టభద్రులే అయినప్పటికీ వారంతా సమాజంలోని ఒక వర్గానికి మాత్రమే ప్రతినిధులు కాదనే విషయం ప్రస్తావిస్తున్నారు. వారిలో వివిధ కులాలు, మతాలు, సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందినవారితోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, నిరుద్యోగులు, పీజీ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఉన్న విషయం విస్మరించలేమంటున్నారు.

దీనికితోడు 108 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 7.16 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారని భారీ నమూనాతో నిర్వహించిన విస్తృత సర్వేలా భావించవచ్చనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, చదువుకున్నవారంతా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సిన పరిస్థితులు తలెత్తడం వంటి పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అదే ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించిందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

శాంతి భద్రతల నిర్వహణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోందని అరాచక శక్తులు పేట్రేగుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. అక్రమ కేసులు, అరెస్టులతో ప్రభుత్వమే ప్రజల్ని భీతావహుల్ని చేస్తోందంటూ వివిధ ఘటల్ని ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎవరూ ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినా, ఎవరో పెట్టిన పోస్ట్‌ను ఫార్వార్డ్‌ చేసినా కేసులు బనాయించిందని వయోవృద్ధుల్ని కూడా విచారణ పేరుతో వేధించిందని ఉదహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు, అక్రమ అరెస్టులు కొదువ లేదని వాలంటీర్లతో ఎక్కడికక్కడ నిఘా పెట్టడం, అందరి కదలికల్ని డేగకళ్లతో పరిశీలించడం ప్రజల్ని తీవ్ర అసహనానికి గురి చేశాయన్నది టీడీపీ నేతల అభిప్రాయం.

ఇవీ చదవండి

Last Updated :Mar 19, 2023, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.