అయ్యో..! కడపలోని ఈ టెక్స్‌టైల్స్ పార్కుని పట్టించుకునే వారే లేరా?

author img

By

Published : Jan 21, 2023, 8:19 PM IST

kadapa

An unused textile park in Mylavaram: వైఎస్సార్‌ జిల్లా మైలవరంలో 2005లో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌ పార్క్‌ ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉందని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి 62.18 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్క్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో పిచ్చి మొక్కలతో నిండిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి టెక్స్‌టైల్‌ పార్క్‌కు నిధులను కేటాయించి.. పునరుద్ధరించాలని చేనేత కార్మికులు, స్థానికులు కోరుకుతున్నారు.

An unused textile park in Mylavaram: రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగమే అతి పెద్ద పరిశ్రమ. చేనేతను నమ్ముకుని వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మైలవరంలో టెక్స్‌టైల్ పార్కును నిర్మించారు. భవనాలు పూర్తి అయిన.. ఇప్పటివరకూ ప్రభుత్వం గానీ. అధికారులు గానీ, ఎమ్మెల్యేలు గానీ పట్టించుకోకపోవడంతో ప్రారంభానికి నోచుకోక సుమారు 15 ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉంది.

వైఎస్సార్‌ జిల్లా మండల కేంద్రమైన మైలవరంలో 2005 మే 24వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టెక్స్‌టైల్ పార్క్ కోసం శిలాఫలకం వేశారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 62.18 ఎకరాల్లో భవన నిర్మాణ పనులు చేపట్టారు. వీటికోసం ప్రభుత్వం 7.9 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పార్కులో మొత్తం 118 ప్లాట్లు ఏర్పాటు చేయగా.. 43 ప్లాట్లకు ఔత్సాహిక పారిశ్రామివేత్తలు ఆ సమయంలోనే అడ్వాన్సులు చెల్లించారు.

ఆ తరువాత అడ్వాన్స్ రూపంలోనే 8 లక్షల 86 వేల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. దీంతో అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ భవనాలు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. సుమారు 15 ఏళ్లుగా ఆ పార్కును ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. పార్క్ ఆవరణమంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. తలుపులకు చెదలు పట్టాయి. ప్రభుత్వాలు మారినా.. పార్కు రూపురేఖలు మాత్రం మారడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వైఎస్సార్‌ జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గంలో చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువ. జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మర నంద్యాల, వేపరాల, మైలవరం, ముద్దనూరు తదితర ప్రాంతాల్లో చేనేత వృత్తిని నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారి జీవన విధానం మరింత మెరుగుపడాలంటే పార్కును ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు, స్థానికులు అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఆనాడూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ చేనేత పార్కును ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకొని ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తే.. జిల్లావ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

మైలవరంలో ఆనాడూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్స్‌టైల్స్‌ పార్క్‌ను ప్రారంభించారు. అప్పుడు దాదాపు పనులు పూర్తయ్యాయి. కానీ, ఇప్పటివరకూ పార్క్‌ను ప్రారంభించలేదు. ఆ కారణంగా ఆ పార్క్ ఇప్పటివరకూ నిరుపయోగంగా అలాగే ఉంది. దీన్ని ఎమ్మెల్యే గారు, సీఎం జగన్ గారి సొంత జిల్లా అని చెప్పుకోవటం తప్ప ఈ టెక్స్‌టైల్స్ పార్క్ గురించి ఎవరూ కూడా ఆలోచించటం గానీ చేయటం లేదు. ఇప్పటికైనా సీఎం జగన్, అధికారులు స్పందిస్తే వేలాది చేనేత కార్మికుల జీవితాలు మెరుగుపడుతాయి.- చేనేత కార్మికుడు ఎం. విజయ్ భాస్కర్, మైలవరం మండలంయ

కడపలోని టెక్స్‌టైల్స్ పార్కు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.