Untimely Rains Damage Tobacco: పొగాకు రైతులు ఆగమాగం.. పరిహారం అందిన దాఖలాలు లేవు

author img

By

Published : May 7, 2023, 10:07 AM IST

Untimely Rains Damage Tobacco

Tobacco Farmers Affected By Untimely Rains: అకాల వర్షం పొగాకు రైతుల ఆశలకు పొగబెట్టింది. పంట చేతికందే దశలో మొక్కలు నేలవాలి ఆకులకు మచ్చలు రావడంతో ఆనందం ఆవిరైంది. లక్షల రూపాయలు అప్పులు చేసి పంటపై పెట్టుబడి పెట్టిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

పొగాకు రైతులు ఆగమాగం..పరిహారం అందిన దాఖలాలు లేవు

Tobacco Farmers Affected By Untimely Rains : అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయి. వర్షాల కారణంగా వరి పండించిన రైతులు ఓ వైపు దిక్కు తోచని స్థితిలో ఉండగా.. మరోవైపు వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులు సైతం సర్వం కోల్పోయారు. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి పంటలపై పెట్టుబడి పెట్టిన రైతులు.. వర్షం కారణంగా పూర్తిగా పంట నష్టపోగా.. ఇప్పుడు ప్రభుత్వం అందించే సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేసిన అధికారులు నెలలు గడిచినా పరిహారం అందించకపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

వందలాది ఎకరాల్లో పొగాకు నష్టం : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పుట్టిముంచుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాలం కాని కాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వరితో పాటు వాణిజ్య పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. మార్చి రెండో వారంలో కురిసిన అకాల వర్షంతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో వందలాది ఎకరాల్లో పొగాకుకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా పొగాకు మొక్కల నుంచి ఆకులు రాలిపోవడం సహా మొక్కలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన ఆకులు కూడా చిరిగిపోవడం, మచ్చలు రావడంతో నాణ్యత దారుణంగా పడిపోయింది.

పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి : జంగారెడ్డిగూడెం మండలం చిన్నంవారి గూడెంలో రైతులు విస్తృతంగా పొగాకు చేస్తున్నారు. ఎకరాకు సుమారు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు అకాల వర్షంతో సర్వస్వం కోల్పోయారు. ఉన్నదంతా పెట్టుబడి రూపంలో పొగాకుపై పెడితే వర్షం రూపంలో తుడిచిపెట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయల పెట్టుబడిలో కనీసం సగం కూడా రాదని రైతులు వాపోతున్నారు.

పరిహారం అందిన దాఖలాలు లేవు : వర్షాలతో రాలిపోయిన ఆకులను కూలీలతో ఏరి, వాటిని బ్యారెన్​కు తరలించి క్యూరింగ్ చేయించి గ్రేడింగ్ చేయడానికే ఎకరాకు 30 వేల రూపాయలు ఖర్చవుతుందని, కనీసం ఆ 30 వేల రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. పంట నష్టం అంచనాలు రూపొందించడం కోసం వచ్చిన అధికారులు వివరాలు నమోదు చేసుకుని రెండు నెలలు గడిచినా ఇప్పటికీ పరిహారం అందిన దాఖలాలు లేవని రైతులు వారి గోడు వెల్లబోసుకుంటున్నారు.

ఆత్మహత్యలే శరణ్యం : పొగాకు సాగు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతుందని చెబుతున్న రైతులు....తాము నష్టపోయిన దానిలో కనీసం సగమైనా పరిహారం రూపంలో అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ ప్రతి ఒక్కరూ వచ్చి అంచనాల వివరాలు నమోదు చేసుకున్నా, పరిహారం విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టతా లేదని వాపోతున్నారు. ఇప్పటికే మద్దతు ధర లేక సతమతమవుతున్న తమకు కనీసం పరిహారం విషయంలోనూ ఊరట లేదని ఆవేదన చెందుతున్నారు. పొగాకు సాగు చేయాలంటే ప్రభుత్వం నుంచి సాయం అందాలని, లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు..

ప్రభుత్వ సాయం ఎదురుచూపు : మార్చిలో కురిసిన వర్షాలకే పొగాకు రైతులు సర్వం కోల్పోగా ప్రస్తుతం మరో సారి వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా కురుస్తున్న వర్షాలు వారిని కోలుకోలేదని దెబ్బతీస్తున్నాయి. పంట పండించి దాన్ని అమ్ముకుని సొమ్ములు చూడాల్సింది పోయి, ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురుచూసేలా చేస్తున్నాయి.

"ఎకరాకు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాము. పై నుంచి కింది వరకూ ఒక్క ఆకు కూడా లేకుండా రాలిపోయాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాదు." పొగాకు రైతులు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.