విశాఖ ఎంపీ ఎంవీవీ లేఅవుట్‌లో అడుగడుగునా అక్రమాలు : తెదేపా నేత పల్లా

author img

By

Published : Nov 19, 2022, 1:11 PM IST

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు

Visakha lands: విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం లేఅవుట్‌లో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నాయని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. భూములు ఒకరి పేరున ఉంటే.. మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారని విమర్శించారు. ఈ అక్రమాలకు తోడు పార్కు, శ్మశానవాటిక స్థలాలను సైతం ఆక్రమించారని పల్లా ఆరోపించారు.

Palla Srinivasa Rao : : విశాఖ నగర పరిధి కూర్మన్నపాలెంలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లేఅవుట్‌లో అడుగడుగునా అక్రమాలు చోటుచేసుకున్నాయని తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ‘కూర్మన్నపాలెంలో సైమన్‌ అనే వ్యక్తికి 25 ఎకరాల భూములను గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఆయా భూముల్లో సైమన్‌ తన బంధువు డి.పాల్‌కు 6.80 ఎకరాలు, కుమార్తె షీలా మార్గెట్‌కు 3.20 ఎకరాలు, ఇతర కుటుంబ సభ్యులకు 15 ఎకరాలు కేటాయించారు. పాల్‌ తనకు కేటాయించిన భూమిలో లేఅవుట్‌ వేశారు. అందులో డీఎల్‌బీ (డాక్‌ లేబర్‌ యార్డు) ఉద్యోగులు 167 మంది స్థలాలు కొనుగోలు చేశారు. షీలా మార్గెట్‌కు చెందిన స్థలం ఖాళీగా ఉంది. పాల్‌ లేఅవుట్‌కు 2000లో వుడా అధికారులు ఎల్‌పీ (ల్యాండ్‌ పొజిషన్‌) ధ్రువపత్రం జారీ చేశారు.

పాల్‌ దగ్గర స్థలాలు కొనుగోలు చేసిన వ్యక్తులు, షీలా మార్గెట్‌ గానీ విశాఖ ఎంపీ ఎంవీవీకి భూములు రిజిస్ట్రేషన్‌ చేయలేదు. 15 ఎకరాలకు అనుభవదారులుగా సైమన్‌ ఇతర కుటుంబ సభ్యులతో ఎంపీ రిజిస్ట్రేషన్‌ చేయించుకొన్నారు. లేఅవుట్‌లో 1200 చదరపు గజాల పార్కు స్థలం ఉంది. మరో 30 సెంట్లలో శ్మశాన వాటిక స్థలం, దాన్ని ఆనుకొని 30 అడుగుల రోడ్డు ఉంది. ఇందులోనే పోలవరం కాలువకు నాలుగు ఎకరాల భూములను లోగడ కేటాయించారు. వీటన్నింటిని కలిపి ఎంపీ ఎంవీవీ నిర్మాణాలు చేపట్టారు...’ అని పల్లా శ్రీనివాసరావు వివరించారు.

దీనికి సంబంధించి లేఅవుట్‌ ప్లాన్‌ను ఆయన మీడియాకు చూపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలవరం కాలువను ఓపెన్‌గా ఉంచొద్దని, పైపులైను వేయాలని 2019లో ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పారు. ‘లేఅవుట్‌లో పార్కుకు కేటాయించిన స్థలం గతంలో జీవీఎంసీ పేరున రిజిస్ట్రేషన్‌ అయింది. అయినా జీవీఎంసీ అధికారులు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం అక్రమాలకు పరాకాష్ఠగా నిలిచింది. ఆయా అంశాలపై కలెక్టర్‌ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. లేకపోతే తెదేపా అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం...’ అని పల్లా వెల్లడించారు.

ముందు జాగ్రత్తగా ఆ లేఅవుట్‌లో ఎవరూ ఇళ్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ.. విశాఖలో దసపల్లా, రేడియంట్‌, రాడిసన్‌బ్లూ, హయగ్రీవ భూములను వైకాపా నేతలు కబ్జా చేసుకుంటూ పోతున్నారని ఆరోపించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన జీవీఎంసీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. 87వ వార్డు తెదేపా కార్పొరేటర్‌ బొండా జగన్‌ మాట్లాడుతూ శ్మశాన వాటిక స్థలానికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తున్నా అనుమతులు ఇచ్చారని చెప్పారు.

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.