విశాఖలో 'గడప గడపకు ప్రభుత్వం'.. మాజీ మంత్రి అవంతి నిలదీత!

author img

By

Published : May 12, 2022, 10:47 PM IST

MLA Avanti facing bitter experience on gadapa gadapaku

gadapa gadapaku program in Visakhapatnam: 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమం వైకాపా వీరాభిమానులకు మాత్రమే పరిమితం అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలు తమ గోడు వెళ్లబోసుకుంటుంటే.. సమస్యలను పక్కనపెట్టి "జై జగన్" నినాదాలు చేయాలంటూ కార్యక్రమాన్ని "మమ" అనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లా ఆనంపురం మండలం పెద్దిపాలెం పంచాయతీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతిని సమస్యలపై స్థానికులు నిలదీశారు.

Visakhapatnam News: విశాఖ జిల్లా ఆనందపురం మండలం పాలెం పంచాయతీలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు 'గడపగడపకు ప్రభుత్వం' కార్యక్రమాన్ని 2వ రోజు కొనసాగించారు. ఇందులో భాగంగా ఎస్సీ కాలనీలో కొన్ని గడపలకు వెళ్లారు. ఎక్కడ చూసినా మురుగు నీరు రోడ్లమీదే ప్రత్యక్షమైంది. కాలువలు సక్రమంగా లేవనే విషయాన్ని మహిళలు లేవనెత్తినప్పటికీ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి మాత్రమే ప్రస్తావించి "మమ" అనిపించారు. దీంతో.. కొంతమంది మహిళలు ఎమ్మెల్యే అవంతిని గట్టిగా నిలదీశారు. అంతా మీరే మాట్లాడుకుంటే మా దగ్గరకు ఎందుకు వచ్చినట్లని ప్రశ్నించారు. తాము ఓట్లు వేసి గెలిపించామని.. తమ సమస్యలు ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. తాగునీటి పథకం పనిచేయడం లేదని, ఫ్లోరైడ్ వ్యాధితో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరమూ ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామంలో మురుగునీరు అంతా తమ ఇంటి ముంగిటే ఉంటోందని.. కాలువ వేయడానికి కూడా పంచాయతీలో నిధులు లేవని అధికారులు అంటున్నారని పలువురు మండిపడ్డారు. ఊహించని ఈ సంఘటనతో ఎమ్మెల్యే అవంతి అవాక్కయ్యారు.

కనీసం చెత్తను కూడా నెలల తరబడి తీయడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న వాలంటీర్ పన్నులు చెల్లించడం లేదని అనడంతో.. ఎమ్మెల్యే అవంతి ముందే బాధితులు వాలంటీర్​పై మండిపడ్డారు. ఏనాడైనా పన్నులు వసూలు చేసేందుకు వచ్చావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సమక్షంలోనే వాగ్వివాదం చోటుచేసుకోగా.. అవంతి వారివురినీ సముదాయించారు. అదే విధంగా.. ఓ మహిళ తనకు ఇంటిస్థలం లేదంటూ మంత్రికి విన్నవించారు. కరెంట్ బిల్లు ఉండడంతో ఇల్లు రాలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సదరు మహిళ కలుగజేసుకోని.. చాలామందికి ఇల్లు ఉన్నా.. మరలా ఇల్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వారంతా లక్షలాది రూపాయలకు ఇళ్లు అమ్ముకుంటున్నారని బాధితురాలు ఆక్రోశించింది. పంచాయతీ పెద్దలు, అధికారులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని ఎమ్మెల్యే ముందు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈటీవీ ప్రతినిధిని అడ్డుకున్న వైకాపా శ్రేణులు: 'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమం కవరేజికి వెళ్లిన ఈనాడు- ఈటీవీ భారత్​ ప్రతినిధిని వైకాపా నేతలు బలవంతంగా అక్కడి నుంచి పంపించిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఫిరంగిపురంలో జరిగిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కవరేజికి వెళ్లిన ఈనాడు-ఈటీవీ భారత్ ప్రతినిధిని ఫిరంగిపురం వైకాపా నాయకులు అడ్డకున్నారు. "మిమ్మల్ని మేం బహిష్కరించాం.. మీ కవరేజి మాకు అవసరం లేదు వెళ్లిపోండి." అంటూ వైకాపా నాయకులు అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: 'గడప గడపకు ప్రభుత్వం'పై.. విపక్షాల అసత్య ప్రచారం: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.