'విశాఖ రాజధానిగా పరిపాలనకు సమయం ఆసన్నమైంది'

author img

By

Published : Mar 6, 2023, 6:14 PM IST

మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Amarnath : విశాఖ రాజధానిగా పరిపాలన సాగించేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి అమర్నాథ్ అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో విశాఖకు చేరుకుంటారని ఆయన చెప్పారు. జీఐఎస్ సదస్సు ద్వారా రాష్ట్రం అర్థికంగా బలోపేతం అవుతుందని, ఎంఓయూలపై ప్రత్యేక కమిటీ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ నెల 18న ఇండస్ట్రియల్ పాలసీ విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.

Minister Amarnath : సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిరోజుల్లో విశాఖ వచ్చి.. ఇక్కడే ఉండి పరిపాలన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మంత్రి వెల్లడించారు. అందరూ అనుకున్న సమయానికంటే ముందే సీఎం విశాఖ వస్తారని చెప్పారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్​లో మీడియాతో మాట్లాడారు. జీఐఎస్ సదస్సు 2023 విజయవంతమైందని.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. 376 ఎంవోయూలు జరిగాయని దాదాపు 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు.

ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో... ఎంవోయూల మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ పర్యవేక్షణ చేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే వివిధ పరిశ్రమలకు సంబధించి 96 అనుమతులు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో మొదటి స్థానంలో ఉన్నామని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. పారిశ్రామిక వేత్తలు కోరుతున్నట్లుగా.. వారికి కావలసిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని.. రొయ్యలు, కోకో, మ్యాంగో పల్ప్ ఏపీ నుంచి ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. విశాఖ తిరుపతి శ్రీ సిటీ కోపర్తిలో ఐటీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆరు నెలల్లో ఏయే కంపెనీలు గ్రౌండ్ రియాలిటీ చేస్తారో వారికి ప్రభుత్వం తరఫున మంచి సహకారం ఉంటుందని చెప్పారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్

దాదాపు 352 ఎంఓయూలు జరిగాయి. 13 లక్షల రూపాయల పెట్టుబడులకు సంబంధించి విశాఖ వేదిక కావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేయడానికి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ దోహదపడుతుందని భావిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్ అవసరాలకు ఎంతగానో దోహదపడుతుంది. చాలా మంది.. కొన్ని సందర్భాల్లో రిలయన్స్ వెళ్లిపోయిందన్నారు.. అంబానీ వెళ్లిపోయారని, అదానీ కూడా వెళ్లిపోయిందని ప్రచారం చేశారు. కానీ, వాళ్లంతా పెట్టుబడులను, వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని చెప్తున్నారు. ఈ విషయాలను విమర్శకుల విజ్ఙతకు వదిలేస్తాం. ఇకపై పెద్దగా చర్చించాల్సిన అవసరం, సమాధానం చెప్పాల్సిన పని లేదు. గడచిన మూడున్నరేళ్లలో 89శాతం రియలైజేషన్ చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే ట్రాక్ రికార్డును తాజా ఎంఓయూల విషయంలోనూ కొనసాగిస్తామనే నమ్మకం ఉంది. ఆ మేరకు ప్రత్యేకంగా ఓ కమిటీని సీఎం ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తాం. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. విశాఖ, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 18వ తేదీన పాలసీ విడుదల చేస్తాం. - గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర మంత్రి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.